యూరియా లేక రైతుల ఇక్కట్లు
Former Sirpur MLA Koneru Konappa: సిర్పూర్ నియోజకవర్గంలో రైతులు యూరియా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భట్టుపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు నిత్యం యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, అష్ట కష్టాలు పడుతున్నారని వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యూరియా కొరత వస్తే కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు కూర్చుని సమస్య పరిష్కారం చేశామని గుర్తు చేశారు. రెండు రైళ్ల నిండా యూరియా పెద్దపల్లికి వస్తే అక్కడి నుంచి ఐదు లారీల్లో తీసుకువచ్చి గ్రామ గ్రామాన రైతులకు యూరియా బస్తాలు అందించామన్నారు.
ఇవ్వాళ పరిస్థితి ఎలా ఉందో మీరు గ్రహించాలని ఆయన కోరారు. రైతులకు యూరియా తెచ్చే దిక్కే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం జిమిక్కులు చేయడం సమస్యలను పక్క దారి పట్టించడం జరుగుతోందన్నారు. ఓవైపు పోడు భూముల విషయంలో సైతం రైతులు నష్టపోతున్నారని, యూరియా వల్ల ఇబ్బందులు పడుతున్నారని, చివరకు పత్తి అమ్మినా నష్టపోవాల్సిన దుస్థితి పట్టిందన్నారు.