మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇండ్ల‌లో సోదాలు

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ నివాసంపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. రైస్ మిల్లుల్లో జరిగిన కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం కుంభకోణం కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో ఎక్క‌డా కూడా ధాన్యం కుంభ‌కోణానికి సంబంధించి ఈడీ బృందాలు దాడులు చేయ‌లేదు. కొద్ది రోజుల కింద‌ట ధాన్యం కుంభ‌కోణానికి సంబంధించి కోట్లాది రూపాయ‌ల చెల్లింపులు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇంత డ‌బ్బు ఒకేసారి ఎలా వ‌చ్చింద‌నే విష‌యంలో ఈ సోదాలు జ‌రుగుతున్న‌ట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే ఇల్లు, పరిసరాలను తమ అదుపులోకి తీసుకున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఇంట్లో ఉద‌యాన్నే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఈడీ (ED) అధికారులు సైతం పాల్గొన్నట్లు సమాచారం. పరిస్థితి అదుపుతప్పకుండా ఇంటి చుట్టూ సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను భారీగా మోహరించారు. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. కనీసం మీడియాను కూడా ఇంటి సమీపానికి అనుమతించడం లేదు.

ఈ ఆకస్మిక దాడులకు ప్రధాన కారణం.. రేఖా నాయక్‌కు చెందిన సత్తెనపల్లిలోని ‘ఏఆర్ఎస్ (ARS) ఇండస్ట్రీస్’ రైస్ మిల్లు వ్యవహారమేన‌ని చెబుతున్నారు. 2022 నుంచి 2025 మధ్య కాలంలో భారీగా సీఎంఆర్ (CMR) ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ. 40.96 కోట్ల విలువైన 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు లెక్కలు తేల్చారు. ప్రభుత్వానికి చేరాల్సిన సీఎంఆర్ డబ్బులు పక్కదారి పట్టింది. ఈ అక్రమాలపై అప్పటికే ఆగస్టు 2026లో ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. రైస్ మిల్లులపై ఇదివరకే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు జరిపి, అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

అయితే, ఈ డ‌బ్బుల‌కు సంబంధించి ఈ మ‌ధ్య కాలంలో చెల్లింపులు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నే విష‌యంలో విచార‌ణ కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంటి లోపల రేఖా నాయక్‌ను అధికారులు ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ దాడుల విషయం తెలుసుకున్న రేఖా నాయక్ అనుచరులు, కార్యకర్తలు ఆమె నివాసం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఖానాపూర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

You might also like