పెండ్లి సంబంధం చూస్తానంది… ఇల్లు మొత్తం దోచేసింది..
మీకు తెలిసిన వాళ్లు ఉంటే చెప్పండి.. నేను పెండ్లి సంబంధాలు చూస్తానని చెప్పడంతో వారు నమ్మారు.. అయితే ఇంట్లో వాళ్ళను పెళ్లి సంబంధం పేరుతో బయటకు పంపిన ఓ మహిళ ఇంట్లో చోరీకి పాల్పడింది.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తాళ్లగురిజాలలో జరిగిన కొత్త తరహా చోరీ వివరాలు ఇలా ఉన్నాయి..
పుల్లగొర్ల పుష్పలత అనే మహిళ తాను పెండ్లి సంబంధాలు చూస్తానని చెబుతుండేది. దీంతో తాళ్లగురిజాలకు చెందిన ఇందూరి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన తమ్ముడు మహేందర్ కి సంబంధం చూడమని చెప్పడంతో ఆమె సరేనని ఒప్పుకుంది. ఈ నెల 22న ఉదయం చంద్రశేఖర్ కి ఫోన్ చేసి మీ తమ్ముడికి మంచిర్యాలలో పెళ్లి సంబంధం చూశాను మీరందరూ కుటుంబ సభ్యులు మంచిర్యాలకు రావాలని చెప్పింది. దీంతో వారందరూ బయలుదేరి మంచిర్యాలకు వచ్చారు. తాను మాత్రం చంద్రశేఖర్ ఇంటికి వెళ్లింది. చంద్రశేఖర్ వాళ్ళ పాప ఇంటి దగ్గర ఉండడం గమనించి ఆమెను కిరాణం షాప్ కి పంపించింది. చంద్రశేఖర్ అమ్మానాన్న ఇంటి తాళం పగలగొట్టి బీరువా తాళం ఒక ఐరన్ రాడ్ తో ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారు నెక్లెస్, 15,000 రూపాయలు దొంగతనం చేసింది.
ఆ తర్వాత తీసుకొని బయటకు వచ్చేసి, గొల్లగూడ కన్నాలలోని ఆమె ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం దొంగిలిచిన బంగారు నెక్లెస్ బెల్లంపల్లిలో అమ్మేందుకు వెళ్తుండగా, తాళ్ల గురజాల ఎస్ఐ రామకృష్ణ, ఏఎస్ఐ బాబాజీ, కానిస్టేబుల్ తిరుమల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పుష్పలత వద్ద బంగారు నెక్లెస్, 15,000 రూపాయలు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.