మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీయండి
Balka Suman:ఆచరణ సాధ్యంకాని హామీ లిచ్చి అధికారంలోకి వచ్చి మాట నిలుపుకోని కాంగ్రెస్ సర్కారును ఊరూరా నిలదీయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. సోమవారం క్యాతన్‌పల్లిలో “అప్పుడే మంచిగ ఉండే” కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని ఫిర్యాదుల రూపంలో సేకరించే ఈ కార్యక్రమం ఇక్కడ నుంచే మొదలవుతుందన్నారు. చెన్నూర్ లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. మార్గదర్శకంగా నిలవాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఏ ఊరులో..? ఎవరెవరికి ఇచ్చారు..? ఎందరికి ఇచ్చారో నాకంటే బాగా మీకే తెలుసన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకున్నారు..
కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ల బంధువులకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, చివరకు ఇందిరమ్మ ఇండ్లను సైతం అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. దీనిపై గ్రామాల్లో చర్చ పెట్టి, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. బాల్క సుమన్ ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లాలో ఎరువుల కోసం క్యూలో చెప్పులు కనిపించాయా..? అని ప్రశ్నించారు. మా నాన్నసికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఉంటే ఆయన్ని వదిలేసి వచ్చి మరీ ఇక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించి రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కానీ, ఈ రోజు మంత్రికి, ఎమ్మెల్యేలకు రైతులు యూరియా కోసం క్యూ కడితే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిష్టంపేట మిల్లులో సీసీఐ పత్తి కొనకపోతే రైతులు రాస్తారోకో చేశారని, అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేవని గుర్తు చేశారు.
వందల కోట్లతో అభివృద్ధి పనులు…
బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు సాగాయని బాల్క సుమన్ గుర్తు చేశారు. మందమర్రిలో రూ. 500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తే దాన్ని పట్టించుకునేవారు లేక బెల్లంపల్లికి తరలిపోయిందన్నారు. రూ. 1650 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేస్తే దానికి అతీగతీ లేదన్నారు. సుద్దాలలో రూ.15 కోట్లతో బ్రిడ్జి కట్టించానన్నారు. బొక్కల గుట్టలో బ్రిడ్జి. గాంధారి మైసమ్మ జాతరకు పోయేందుకు రోడ్డు నిర్మించామన్నారు. రూ.500 కోట్లతో గాంధారి వనాన్ని కేసీఆర్ అర్బన్ పార్క్ అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ సైతం మొదలు పెట్టామన్నారు. కోటపల్లి మండలంలో తుత్తుంగ వాగుపై రూ. 8.50 కోట్లతో బ్రిడ్జి కడితే.. ఏదుల్లబంధం, పుల్లగామ, సిర్సా, రొయ్యలపల్లి, అల్గామా, సుపాక, జనగామ ప్రజలకు మంచి జరుగుతుందని ఆలోచించామన్నారు. మంత్రి వివేక్ గ్రామాల్లోకి వస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన మాటలు గుర్తు చేయాలన్నారు. నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు, అగ్రికల్చర్, మైనింగ్ ఇనిస్టి ట్యూషన్లు, సింగరేణి ఫ్యాక్టరీలు, స్కిల్ డెవలప్మెంట్సెంటర్లు ఏమయ్యాయో జనం అడగాలన్నారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు…
“అప్పుడే మంచిగ ఉండే” కార్యక్రమంలో భాగంగా 50 శాతం ఓటర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు సహా, ఇతర హామీల కింద ఏదైనా లబ్ది చేకూరిందా లేదా..? అని లబ్దిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కలెక్టర్ కు అందజేస్తామన్నారు. ఈ నెల 28న చెన్నూర్, మందమర్రి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీలతో పాటు భీమారం, జైపూర్ మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. 15 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుందన్నారు. మనం సరిగ్గా దృష్టి పెడితే వచ్చే స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందన్నారు