మంత్రి వివేక్ ఓడిపోయిండు..
Minister Vivek:ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు లేవు.. ఎంపీ ఎన్నికలు అసలే లేవు.. మరి మంత్రి ఓడిపోవడం ఏంటని ఆలోచిస్తున్నారా…? ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి జరిగిన ఎన్నికల్లో మంత్రి వివేక్ మద్దతు చెప్పిన వ్యక్తి ఓటమి పాలయ్యారు.. ఎన్నికలు అన్నాక గెలుపు ఓటములు సాధారణమే.. కానీ, ఆ ఎన్నికను మాత్రం కాంగ్రెస్ పార్టీకే చెందిన మంత్రి, ఎమ్మెల్యే తలపడ్డారు. ఎన్నికలు చిన్నవే అయినా.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ పోటీ పడ్డారు. చివరకు ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థే గెలవడంతో ఒక రకంగా ఇది మంత్రి ఓటమేనని పలువురు చెబుతున్నారు.
దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో కొక్కిరాల సత్యపాల్ రావును విజయం వరించింది. వాస్తవానికి ఈ ఎన్నికలు మొదటి నుంచి ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నిక మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. ఇందులో మంత్రి వివేక్ కాగా, ఆయన ప్రత్యర్థి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుగా మారారు. మంత్రి వివేక్ ఆయన తమ్ముడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కలిసి పూస్కూరి విక్రమ్ రావును ఆదివాసీ కార్మిక సంఘం తరఫున బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు. అప్పటికే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఆయన తమ్ముడు సత్యపాల్ రావు పోటీలో ఉన్నారు. ఆయనను ఓడించేందుకే మంత్రి వివేక్ పూస్కూరి విక్రమ్‌ను బరిలోకి దించారని సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అయ్యాయి.
సత్యపాల్ ఎన్నో నెలలుగా దేవాపూర్‌లోనే మకాం వేసి కార్మికులతో మమేకం అవుతున్న సందర్భంలో సడెన్ గా వివేక్ తన అనుచరుడిని రంగంలోకి దింపడంతో రాజకీయ వేడి పెరిగింది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో రెండు వర్గాలు బరిలోకి దిగాయి. ప్రేంసాగర్ రావును దెబ్బ తీసి ఆయన ఉనికి కేవలం మంచిర్యాల వరకే పరిమితం చేయాలని మంత్రి వివేక్ భావించారు. సొంత మండలం, తన తండ్రి హయాం నుంచి దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ లో గెలుపు ఇలా ప్రేంసాగర్ రావు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. వివేక్ వర్గాన్ని ఓడగొట్టి తన పగ తీర్చుకోవాలని ప్రేంసాగర్ రావు పావులు కదిపారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు కత్తులు దూసుకోవడంతో ఎన్నిక చాలా రసవత్తరంగా మారింది.
ఓట్ల కోసం రెండు వర్గాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. మందు, విందులు, క్యాంపు రాజకీయాలకు సైతం తెర లేపారు. ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికలను తలపించేలా ఓటర్లను క్యాంపులకు తరలించారు. వారు కోరింది కాదనకుండా తెచ్చిపెట్టారు. ఎన్నికల తేదీ మారడంతో ఓటర్లను తీసుకువచ్చి మళ్లీ క్యాంపులకు తీసుకువెళ్లారు. ఇక మంత్రి వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరులు, మందీ మార్బలం అంతా దాదాపు వారం రోజులుగా ఇక్కడే మకాం వేశారు. ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల కోసం ఎన్నడూ చూడనంతగా రాజకీయంగా మార్చేశారు. చివరకు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో విజయం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు సోదరుడు సత్యపాల్‌ను వరించింది. దీంతో మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జులు పరోక్షంగా ఓటమిపాలయ్యారు.
మంత్రి వివేక్ నిర్ణయం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రేంసాగర్ రావుపై కోపంతో ఒక వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టడం అది కూడా సొంత పార్టీకి చెందిన వ్యక్తిపైనే పోటీకి దించడం సరికాదని పలువురు చెబుతున్నారు. పూస్కూరి విక్రమ్ రావు ఎమ్మెల్యే ఎన్నికలు అయ్యాక పార్టీలోకి వచ్చారు. మరి అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా, ముఖ్యమైన ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టడం కూడా విమర్శలకు కారణం అవుతోంది. వారు హుందాగా సత్యపాల్‌కు మద్దతు ఇచ్చి ఉంటే వారిపైన పార్టీలో గౌరవం పెరిగేదని, వివేక్ మరోసారి రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.