మంచిర్యాల‌, కాగ‌జ్‌న‌గ‌ర్‌లో వందేభార‌త్‌కు హాల్టింగ్

Vande Bharat:నాగ్‌పూర్-సికింద్రాబాద్ మార్గంలో న‌డుస్తున్న వందేభార‌త్ రైలుకు మంచిర్యాల‌, కాగ‌జ్‌న‌గ‌ర్‌లో హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. ఈ రైలు ఇక్క‌డ ఆగ‌డ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఎంపీ వంశీకృష్ణ‌, మంచిర్యాల బీజేపీ నేత వెర‌బెల్లి ర‌ఘునాథ్ త‌దిత‌రులు త‌ర‌చూ రైల్వే శాఖ ఉన్న‌తాధికారుల‌ను క‌లిశారు. చివ‌ర‌కు ఈ రైలుకు హాల్టింగ్ క‌ల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది.

మంచిర్యాల రైల్వే స్టేష‌న్ నుంచి నిత్యం 20,000 మంది రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఇక్క‌డి నుంచి అధికంగా హైద‌రాబాద్‌, అటు నాగ్‌పూర్ ప్రాంతాల‌కు వెళ్లి వ‌స్తుంటారు. ఈ రైల్వే స్టేష‌న్ ద్వారా రోజుకు దాదాపు రూ. 5 లక్షల ఆదాయం వ‌స్తుండ‌గా, వస్తువుల రవాణా ద్వారా రూ. 30 కోట్ల ఆదాయాన్ని నమోదు చేస్తుంది. కాగజ్‌నగర్ రైల్వే స్టేష‌న్ నుంచి సైతం చాలా మంది రాక‌పోక‌లు సాగిస్తారు. ఇది కాగజ్‌నగర్ ప్రజలకు మాత్రమే కాకుండా, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల వారు వ‌స్తుంటారు. మంచిర్యాల అమృత్ భారత్ పథకం కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన‌ 500 స్టేషన్లలో ఒకటి.

ఇలా ఎంతో మందికి ఉప‌యోగ‌ప‌డే ఈ రెండు రైల్వేస్టేష‌న్ల‌లో వందేభార‌త్ ఆప‌క‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా కాగ‌జ్‌న‌గ‌ర్ నుంచి భాగ్య‌న‌గ‌ర్ వెళ్లిపోయిన త‌ర్వాత రైలు లేక‌పోవ‌డంతో జ‌నం ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. అదే స‌మ‌యంలో అటు నుంచి సైతం రైలు సౌక‌ర్యం స‌క్ర‌మంగా లేదు. వందేభార‌త్‌కు హాల్టింగ్ క‌ల్పించాల‌ని ఎన్నో రోజులుగా డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ రైల్వే శాఖ అధికారులు ప‌ట్టించుకోలేదు. అయితే, పెద్ద‌ప‌ల్లి ఎంపీ వంశీకృష్ణ‌, బీజేపీ నేత వెర‌బెల్లి ర‌ఘునాథ్‌, మంచిర్యాల జిల్లా నేత‌లు రైల్వే శాఖ అధికారుల‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు ఈ రైలుకు రెండు స్టేష‌న్ల‌లో హాల్టింగ్ క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే, ఈ హాల్టింగ్ ఎప్ప‌టి నుంచి అనేది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు ప్రారంభమ‌య్యే ఈ వందే భారత్ డైలీ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ఉదయం 9.05 గంటలకు రామగుండం చేరుకుంటుంది. దీనికి రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 18 చైర్-కార్ కోచ్‌లు ఉంటాయి. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమై రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌కు తిరిగి వస్తుంది. ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 578 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like