స్థానిక ఎన్నిక‌ల‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

Local Bodies election: స్థానిక సంస్థల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. శనివారం అసెంబ్లీ క‌మిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మేర‌కు స్థానిక ఎన్నిక‌ల‌పై కేబినేట్ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే కాకుండా, సెప్టెంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసేలా చ‌ర్య‌లు తీసుకోనుంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌ నెలాఖరులోగా నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు గత ప్రభుత్వం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించి ఉండకూడదని 2018 ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. కానీ తాజాగా రేవంత్ సర్కార్‌ ఈ పరిమితిని ఎత్తివేసి ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించింది. ఇక ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని ఢిల్లీలో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఇతర కీలక నేతలు నిరసన చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 285 (ఏ) (Panchayathiraj Act-2018, Section 285 (A) కు సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. స్థానిక సంస్థల్లోని 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తి వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానం‌లో అసెంబ్లీ‌లో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని నిర్ణయించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like