భారీ చోరీ కేసు చేధించిన పోలీసులు
-ముగ్గురు బ్యాంకు ఉద్యోగులతో సహా 44 మంది అరెస్టు
-15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ
Police crack major theft case:పోలీసులు భారీ చోరీ కేసును చేధించారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులతో సహా 44 మందిని అరెస్టు చేసి, 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. చెన్నూరు ఎస్బీఐలో గోల్డ్‌లోన్ ఖాతాలకు సంబంధించిన 25.17 కిలోల బంగారు నగలు, నగదు రూ.1.10 కోట్లు మాయం అయ్యాయని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఆగస్టు 23న ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామగుండం కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌కు అప్పగించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. అక్టోబర్ 2024కు ముందే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్న రవీందర్.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు, బెట్టింగ్ కొనసాగించడానికి బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్ కరెన్సీ తాళం మేనేజర్, క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉంటాయి. అయితే మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చాడు. దాంతో క్యాషియర్ నరిగె రవీందర్ మేనేజర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో బంగారం, నగదు దొంగిలించేందుకు పథకం రచించాడు.
అక్టోబర్ 2024 నుంచి తమ బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెడుతున్నబంగారం తీసి, తన స్నేహితులు కొంగోండి బీరష్ (సేల్స్ మేనేజర్, SBFC మంచిర్యాల), కొడాటి రాజశేఖర్ (కస్టమర్ రిలేషన్ మేనేజర్, SBFC మంచిర్యాల), బొల్లి కిషన్ (సేల్స్ ఆఫీసర్, SBFC మంచిర్యాల్)కు అప్పగించేవాడు. వీరు ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి, డబ్బును తమ ఖాతాల్లో జమ చేసి, కొంత కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని క్యాషియర్ రవీందర్‌కి బదిలీ చేసేవారు. ఇప్పటివరకు నిందితులు 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలలో (SBFC, Indel Money, Muthoot Finance Ltd., Godavari Urban, Manappuram, Muthoot Fincorp, Muthoot Mini) 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే, క్యాషియర్ నరిగె రవీందర్ బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై తన భార్య, మరిది, స్నేహితుల పేర్లతో తప్పుడు గోల్డ్ లోన్లు 42 మంజూరు చేసి, బంగారం లేకుండానే రూ.1.58 కోట్లు విత్‌డ్రా చేసుకున్నాడు. అంటే 4.14 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించారు. అలాగే క్యాషియర్ రవీందర్, ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడు. పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు బ్యాంకు అధికారులు, వారికి తోడ్పడిన 41 మందితో కలిపి మొత్తం 44 నిందితులను అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు 15.23 కిలోల బంగారు నగలు రికవరీ చేశారు. మిగతా బంగారు ఆభరణాలు ముత్తూర్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లోన్‌లో నుంచి రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.ఈ వ్యవహారంలో గోల్డ్ లోన్ కంపెనీ మేనేజర్ల పాత్రపై కూడా విచారణ చేస్తున్నారు.
ఘటనలో అరెస్టు అయిన వారిలో ఏ 1 నరిగే రవీందర్ (ఎస్బీఐ, క్యాషియర్), వెన్నపురెడ్డి మనోహర్ (ఎస్బీఐ, బ్రాంచ్ మేనేజర్), లక్కాకుల సందీప్ (అవుట్సోర్సింగ్ ఉద్యోగి) కొంగొండి బీరేష్, కోదాటి రాజశేఖర్, బొల్లి కిషన్ కుమార్, ఉమ్మాల సురేష్, నడిగొట్టు సాగర్, రాంశెట్టి చంద్రబాబు, భరతపు రాకేష్, దిగుట్ల సునీల్, కడం రమేష్, దారపు నాగరాజు, నిట్టూరి రాజు, కంబాల మహేష్, కంది మల్లేష్, జూపాక సత్యనారాయణ,దయ్యాల మహేందర్, ఉరుగుండ పరంధాములు, కుమ్మరి నగేష్, మహ్మద్ రషీద్, దాడి రాజ్‌కుమార్, కన్నం రాకేష్, నేరడిగొండ అనిల్ సాయి, దుర్కి ప్రవీణ్ కుమార్, బొడ్డుపల్లి ప్రశాంత్, మంతెన రాజశేఖర్, కొమ్ము మహేష్, పంచల శశిధర్, దుర్గం మనోహర్, జాకవర్ మహేష్, మహమ్మద్ హబీబ్ పాషా, జంగంపల్లి యుంగేందర్, మహమ్మద్ సమీరుద్దీన్, మోతుకూరి శ్రీనివాస్, తాళ్లండి అనాజయ్య, నిమ్మతి సుమ, పాణి రవళిక, ఈసంపల్లి సాయికిరణ్, నరిగె స్వర్ణలత, గౌడ సుమన్, తుండ్ల సురేష్, జుర్రు శ్రీనివాస్, నరిగె సరిత, మోతుకూరి రమ్య, తుంగపిండి శేఖర్ పరారీలో ఉన్నాడు.
కేసు తక్కువ కాలంలోనే చాకచక్యంగా ఛేదించినందుకు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జైపూర్ ఏసీపీ ఏ. వెంకటేశ్వర్, చెన్నూరు సీఐలు దేవేందర్ రావు, ఆర్. బన్సీలాల్, డి. వేణు చందర్, ఏ. ఆశోక్, కె.నరేష్ కుమార్, బాబురావు, ఎస్ఐలు పి. సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోష్, లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వర్, ఉపేందర్ రావు, చంద్రశేఖర్, రవి, హెడ్ కానిస్టేబుళ్లు శంకర్, రవి, పీసీలు రమేష్, ప్రతాప్, తిరుపతి, లింగమూర్తి తదితరులను రామగుండం కమిషనర్ పోలీస్ అభినందించారు.