కాళేశ్వరంపై సీబీఐ విచారణ.. శాసనసభ తీర్మానం
CBI investigation into Kaleshwaram:కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై అసెంబ్లీలో దాదాపు తొమ్మిదిన్నర గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను, అనేక అవకతవకలను ఎత్తిచూపాయని ఆయన తెలిపారు.
ఈ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.