ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే..
-హామీలను గుర్తు చేసేందుకే అప్పుడే మంచిగ ఉండే కార్యక్రమం
-మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్
Balka Suman:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ డ్రామాలు ఆడుతోందని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గడిచిన 20 నెలల్లో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. పాలన అస్తవ్యస్తంగా తయారయ్యిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు వివిధ డిక్లరేషన్ అమలు చేయకుండా కమిషన్ల పేరిట కాలాయాపన చేస్తోందని ఆరోపించారు.
రామకృష్ణాపూర్ ఏరియాలో 4000 కుటుంబాలకు పట్టాలిచ్చామని, కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. మంత్రి వివేక్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి అన్నాడని దాని సంగతి ఇప్పటి వరకు తెలియదన్నారు. తమ హయాంలో 276 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించామని వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. వీళ్లు సర్కారు నడపటం లేదని, సర్కస్ నడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయడం లేదనే విషయం ప్రజలు ఇప్పటికైనా గమనించాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే తప్పు చేసిన వారమవుతామని, మొద్దు నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.
ప్రజలను డైవర్షన్ చేసేందుకు కాళేశ్వరం మీద కమిషన్… కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు, తనపై కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. అప్పుడే మంచిగ ఉండే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు సిద్ధమయినా చెన్నూరు నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ముందు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తాము రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన నాయకులమని ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటామని బాల్క సుమన్ వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని అనంతరం వాటిని హైదరాబాద్‌లో ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందించి వారు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలు గుర్తు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జీ డాక్టర్ రాజారమేష్ తదితరులు పాల్గొన్నారు.