కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్

High Court gives break to CBI probe into Kaleshwaram report: కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణ కు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7 కు వాయిదా వేసింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు స్వల్ప ఊరట లభించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం సీబీఐ విచారణకు ఆదేశించింది. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేసీఆర్, హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై మంగ‌ళ‌వారం విచారణ జరిపిన హైకోర్టు త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు ఎలంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే కోర్టులో ఏజీ సుదర్శన్ రెడ్డి ప‌లు అంశాల‌ను కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. కేవ‌లం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే కేసు విచారణను సీబీఐకి ఇవ్వలేదన్నారు. అన్ని నివేదికలు చూసిన తరువాతనే కేసును సీబీఐకి ఇవ్వడం జరిగిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఇరిగేషన్ శాఖ నివేదిక సైతం కోర్టుకు సమర్పించారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం కేవ‌లం నిర్ణయం మాత్రమే తీసుకుందని, ఇంకా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విష‌యంలో కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కేసీఆర్, హరీష్ రావుకు స్వల్ప ఊరట ల‌భించిన‌ట్ల‌య్యింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like