ఆ నెత్తుటి గాయానికి 22 ఏండ్లు..
అడవి ఉలిక్కిపడ్డ ఆ క్షణం… నెత్తుటితో ముద్దైన మూడు మృతదేహాలు.. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు… ఎన్కౌంటర్ జరిగిందనే సమాచారం అంతటా పాకుతోంది.. చనిపోయింది ఎవరు…? ఎన్కౌంటర్ ఎక్కడ జరిగిందనే విషయంలో ఆతృత.. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చనిపోయింది పీపుల్స్‌వార్ అగ్రనేతలు నల్లాఆదిరెడ్డి అలియాస్ శ్యాం, శీలంనరేష్ అలియాస్ మురళి, ఎర్రంరెడ్డి సంతోస్రెడ్డి అలియాస్ మహేష్‌గా గుర్తించారు. ఆ వార్త ప్రజా సంఘాల నేతలు, సానుభూతిపరులకు షాక్ మిగిల్చింది.
కొయ్యూరు ఎన్కౌంటర్ నెత్తుటి జ్ఞాపకానికి నేటితో 22 ఏండ్లు.. 1999 డిసెంబర్ 2న ప్రస్తుత భూపాలపల్లి జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) మల్హర్ మండలం కొయ్యూరులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రం సంతో్‌షరెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్ మృతి చెందారు. ఈ ఘటన పీపుల్స్‌వార్ పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అప్పటి కేంద్ర కమిటీకి మూల స్థంభాలుగా నిలిచిన ఈ ముగ్గురు చనిపోవడం పీపుల్స్‌వార్ పార్టీకి తీరని నష్టం మిగిల్చింది. ఉత్తర తెలంగాణలో వారు సమాంతర ప్రభుత్వం నడిపించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురి మరణంతో పార్టీ చాలా ఇబ్బందులకు గురయ్యింది.
పీఎల్జీఏ ఏర్పాటు…
పీపుల్స్‌వార్ ఉద్యమంలో కొయ్యూరు ఎన్కౌంటర్ భారీ ఎదురుదెబ్బగా నిలిచింది. ముగ్గురు అగ్రనేతలను కోల్పోయిన పీపుల్స్‌వార్ వీరి జ్ఞాపకార్థం పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పీఎల్జీఏ వారోత్సవాలను జరుపుకుంటు, ఉద్యమంలో అమరులైన సహచరులను మావోయిస్టు పార్టీ స్మరించుకుంటుంది. ఈ క్రమంలోనే సభలు, సమావేశాలతో పాటు కొత్తగా రిక్రూట్మెంట్లతో పీఎల్జీఏను బలోపేతం చేసేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా పెంచటంతో పీఎల్జీఏ వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టం చేస్తున్నారు.
సరిహద్దుల్లో హై అలర్ట్..
22 ఏళ్లుగా మావోయిస్టు పార్టీ కొయ్యూరు నెత్తుటి జ్ఞాపకాన్ని పీఎల్జీఏ వారోత్సవాల్లో స్మరించుకుంటోంది. మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్న క్రమంలో దాడులు చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చే్సతున్నారు. తెలంగా; మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలతో పాటు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల కిందట మహారాష్ట్ర ఎన్కౌంటర్లో 26 మంది మృతి చెందడం, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఖచ్చితంగా ఎదురుదాడికి ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియస్ దామోదర్ పార్టీ తాత్కాలిక బాధ్యతలు చూస్తుననారు. ఆయన యుద్దతంత్రంలో నిపుణుడు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమమత్తం అయ్యారు.
ఏజెన్సీలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని ఏజెన్సీని పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. గురువారం నుంచి ఈ నెల 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఏజెన్సీలో ప్రజారవాణా వ్యవస్థపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితం కావాలని, తమకు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం పర్యటించారు. సీఆర్పీఎఫ్ అదనపు డీజీపీ లక్ష్మీశుక్లా, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీనివా్‌సరెడ్డితో పాటు భద్రాద్రి, ములుగు, మహబుబాబాద్ ఎస్పీలతో 3 గంటలకుపైగా సమావేశమయ్యారు. పీఎల్జీఏ వారోత్సవాల్లో భాగంగా రిక్రూట్మెంట్ ఎక్కువగా జరుగుతుందని, అప్రమత్తంగా ఉండాలని మహేందర్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది.