సింగ‌రేణి గ‌నుల‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించిన సింగరేణి సీఎండీ
-మరిన్ని అవార్డులు సాధించాలని పిలుపునిచ్చిన సీఎండీ ఎన్.బలరామ్

పర్యావరణ హిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ ప‌లు అవార్డులు సాధించింది. జాతీయస్థాయిలో నాలుగు బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి తన ప్రతిభ మరోసారి చాటుకుంది. గురువారం ముంబయిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ నాలుగు గ‌నుల్లో రెండు శ్రీ‌రాంపూర్ ఏరియాకే చెందిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం.

ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో రామగుండం-3 ఏరియాకి చెందిన ఆర్ జి ఓ సి-1 ఎక్స్ టెన్షన్, ఇల్లందు ఏరియాకి చెందిన జే కే-5 ఓసి, భూగర్భగనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకి చెందిన ఆర్కే-6 గని , ఆర్కే న్యూటెక్ గనులు ఉన్నాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏడాది దేశంలో అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్ ను ఇస్తూ అత్యుత్తమ స్టార్ రేటు సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులను అందిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియను స్టార్ రేటింగ్ అంటారు.
ఇలా స్టార్ రేటింగ్ ఇవ్వడం కోసం బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, అక్కడ గల సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోనికి తీసుకుని మార్కులను కేటాయిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి ఉన్న గనులలో ఈ 84 అంశాలను కేంద్ర బొగ్గు శాఖ నుంచి వచ్చిన పరీశీలక బృందం ప్రత్యక్షంగా పరిశీలించి మూల్యాంకనం జరుపుతారు.

ప్రాథమిక మూల్యాంకనం తర్వాత వీటి నుండి అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వాటిలో ఇంకా అత్యుత్తమమైన వాటిని మరో కమిటీ ద్వారా ఎంపిక చేసి, మొత్తం 100 మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధంగా సింగరేణి సంస్థలో ఈసారి నాలుగు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం గ‌మ‌నార్హం. ఈ గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందు వల్లే ఈ అవార్డులు సాధించుకున్న‌ట్లు సీఎండీ బ‌ల‌రామ్ వెల్ల‌డించారు. ఆయ‌న తన హర్షం ప్రకటిస్తూ గనుల యాజమాన్యాలకు, కార్మికులకు తన అభినందనలు తెలిపారు. ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా నాలుగు గనులకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇవే కాకుండా సింగరేణి వ్యాప్తంగా 14 గనులు 100కు 80 నుండి 90 మార్కులు సాధించి 4 స్టార్ రేటింగు ద‌క్కించుకోగా, 20 గనులకు 3 స్టార్ రేటింగ్ లభించడం విశేషం. గతంలో కొన్ని గనులకు 2 స్టార్ రేటింగ్లు కూడా లభించగా.. ఈ సారి అన్ని గనులు కూడా తమ పనితీరును మెరుగుపరచుకుని 3 స్టార్ రేటింగ్ సాధించడం విశేషం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like