దమ్ముంటే సీబీసీఐడీ విచారణ చేయించాలి
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సవాల్
Former MLA Nadipelli Diwakar Rao challenges:వడ్ల కొనుగోళ్ల విషయంలో రూ. 700 కోట్ల మేర గోల్‌మాల్ జరిగిందని, సీబీసీఐడీ విచారణ జరిపిస్తా అన్నారు…? ఆ వ్యవహారం ఏమైందంటూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావును ప్రశ్నించారు. దివాకర్ రావు ఈ రోజు లక్ష్సెట్టిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హయాంలో వడ్ల దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు జిల్లా పరిషత్ చివరి సమావేశంలో మాట్లాడారని గుర్తు చేశారు. మరి ఇన్ని నెలలైనా దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. ఎమ్మెల్యే మొద్దు నిద్ర పోతున్నాడా..? అని నిలదీశారు. ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయో కక్కిస్తానని ప్రేంసాగర్ అన్నారు. వాటిపై సీబీసీఐడీ విచారణ చేయిస్తానని అన్నారు. దమ్ముంటే వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తప్పైందటావా..? క్షమాపణ చెబుతావా చెప్పాలంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. ఆ ఏడువందల కోట్లు లెక్క తీసి ఈ జిల్లాలో ఖర్చు చేయండంటూ స్పష్టం చేశారు.
యూరియా సరఫరా విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాల్సి ఉండే.. కానీ అలా చేయలేకపోయారని అన్నారు. ఆదిలాబాద్ లో గతంలో యూరియా రేక్ పాయింట్ ఉండేది. కానీ, మంచిర్యాలలో రేక్ పాయింట్ తానే తెప్పించానని నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఎల్లంపల్లి, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన విషయంలో ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ప్రేంసాగర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ సంబంధం ఉందంటే వేరే వాళ్లు చెప్పడం కాదని, ఆయనే స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాలన్నారు. దివాకర్ రావుకు కక్కుర్తి పడాల్సిన అవసరం లేదన్నారు.
గూడెం లిఫ్ట్, కడెంకు సంబంధించి ఇబ్బందులు ఎదురైతే తాను వెళ్లితే అక్కడ ఏం మునిగిందని వెళ్లారని ప్రేంసాగర్ ప్రశ్నించాడని అన్నారు. గూడెం లిఫ్ట్ పథకానికి సంబంధించి పైపులు పగిలితే వాటిని తెప్పించి మరమ్మతులు చేయించామని రైతులు ఇప్పుడు బ్రహ్మాండంగా పంటలు పండిచుకుంటున్నారని తెలపారు. నీ డాటా అంతా నా దగ్గర ఉందని.. అవన్నీ బయటకు చెబితే తల ఎత్తుకుని తిరుగుతావో..? దించుకుని తిరుగుతావో తెలుస్తుందంటూ ఎమ్మెల్యే ప్రేంసారగ్ రావుపై దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.