గ్ర‌హ‌ణం ఎఫెక్ట్‌… ఆల‌యాల మూసివేత‌

Eclipse effect… closure of temples:చంద్రగ్రహణం కారణంగా ఇవాళ (ఆదివారం) తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌లోని పలు ఆలయాలను మూసివేశారు. తిరిగి రేపు (సోమవారం) దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆయా ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్నిఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం మూసివేశారు. రేపు(సోమవారం) ఉదయం 3 గంటల అనంతరం సంప్రోక్ష‌ణ చేసి ఆల‌యం తెరుస్తారు. అలాగే, అన్నదానం, లడ్డూ ప్రసాద కేంద్రాలను మూసివేశారు. అంతుకుముందే శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులను క్యూ లైనులోకి వెళ్లకుండా నిలిపివేశారు. శుద్ధి, పుణ్యవహచనం నిర్వహించిన అనంతరం రేపు(సోమవారం) ఉదయం మూడు గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరువనున్నారు అర్చకులు. ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం నుంచే స్వామివారి స్పర్శదర్శనం, ఆర్జిత అభిషేకాలు, పరోక్షసేవలు, స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిలిపివేశారు. ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం ఆలయంలో ప్రాత:కాల పూజలు 7:30 నుంచి స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతులు, మహా మంగళ హారతులు ఇవ్వనున్నారు. అలాగే, రేపు మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2:15 నుంచి 4 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీశైలం ఆలయ ఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేశారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7:30 గంటల నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. రేపు ఉదయం 3:30 గంటల నుంచి తెరువనున్నారు ఆలయ అధికారులు. రేపు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా నిత్యా కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు. ఆదివారం పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని దాదాపు 85 శాతం మంది చూసే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షికంగా కనిపిస్తుంది చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు.

ఈరోజు రాత్రి 8 గంటల 58 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై 11 గంటల నుండి 12 గంటల 22 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై అయిదు నిమిషాలకు గ్రహణం వీడుతుంది. ఇక ఆకాశంలో మేఘాలు లేకపోతే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, ముంబై ఢిల్లీలలో చూడవచ్చు. ఈ చంద్రగ్రహణం దేశమంతటా కనిపిస్తుందని, దీనిని చూడడానికి బైనాక్యులర్ లు అవసరం లేదని ప్లానెట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు రఘునందన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నేడు చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు అన్నింటిని మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత తిరిగి ఆలయాలను తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఇక రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం మూడున్నర నుండి 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు మూసి వేస్తున్నారు. గ్రహణానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసి వేయడం మొదటి నుండి ఉన్న ఆనవాయితీ.

Get real time updates directly on you device, subscribe now.

You might also like