డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చే ఈ గుండెపోటు ఇప్పుడు చిన్నా.. పెద్దా తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తోంది. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి… ఘట్కేసర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ డేవిడ్ (31) మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివాసం ఉంటున్నాడు.. గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా ఆదివారం ఆనంద్బాగ్లో డ్యాన్స్ చేస్తూ డేవిడ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో అతన్ని వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డేవిడ్ ను పరిక్షించి చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు డేవిడ్ ను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు డేవిడ్ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, మూడు నెలల పాప ఉందని సీఐ సత్యనారాయణ తెలిపారు..