క‌విత స‌స్పెన్ష‌న్‌పై కేటీఆర్‌

KTR on Kavita’s suspension:బీఆర్ఎస్ నుంచి తన సోదరి కవిత సస్పెన్షన్ అంశంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి స్పందించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ విష‌యమై నోరు విప్పారు. కొంతకాలంగా క‌విత వ్య‌వ‌హారం బీఆర్ఎస్‌ల చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అంశంపై కేటీఆర్ తొలిసారిగా స్పందించారు.

పార్టీలో ఏది చర్చించాలో అది చర్చించాం… పార్టీ ఇప్పటికే చర్య తీసుకుంది… ఒక్కసారి పార్టీ చర్య తీసుకున్న తర్వాత తాను కామెంట్ చేయడానికి, తదుపరి మాట్లాడటానికి ఏమి లేదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అంతర్గతంగా పార్టీ వేదికలపై ఏదైనా చర్చించాలో అది చర్చించామన్నారు. గోదావరి జలాలను వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర ప్రచారం చేస్తున్నందుకు సీఎం రేవంత్‌తో సహా కాంగ్రెస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్-మూసీ అనుసంధాన ప్రాజెక్టు ఓ క్రిమినల్ కుట్ర అని ఆరోపించారు. రూ. 1100 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన అంచనాలు ఏడు రెట్లు ఎందుకు పెరిగాయో రేవంత్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ. 16 వేల కోట్లతో పూర్తయ్యే మూసి సుందరీకరణ ప్రాజెక్టును కూడా రూ. 1,50,000 కోట్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచితే హైదరాబాద్ ప్రజలతో కలిసి దాన్ని బీఆర్ఎస్ అడ్డుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసిన కంపెనీకే రేవంత్ రెడ్డి వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. బనకచర్ల కోసమే మేడిగడ్డను రిపేర్ చేయించడం లేదని అన్నారు. సొంత డబ్బులతో మూడు పిల్లర్లు రిపేర్ చేయిస్తామని ఎల్ అండ్ టీ ముందుకొచ్చినా రేవంత్ పట్టించుకోవడం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడే నేరాన్ని అంగీకరించారని… స్పీకర్ వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like