ఆటో దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్
ఇంటి ముందు ఉన్న ఆటో దొంగతనానికి గురి కాగా, దానికి సంబంధించిన బాధితుడు వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. అది పోస్ట్ చేసిన రెండు గంటల్లో దొంగతనానికి గురైన ఆటో పట్టుపడింది. అల్వాల్‌లో దొంగతనం జరగ్గా… ఆటో బంజారాహిల్స్‌లో దొరికింది…
జార్ఖండ్‌కు చెందిన బిపిన్ రాజ్‌యాదవ్ మూడేండ్ల కిందట హైదరాబాద్ వచ్చి బొల్లారంలోని ఓ గదిలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఆటోను నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి ఆటోను ప్రతీ రోజు పెట్టే వద్ద పార్కింగ్‌లో ఉంచి తాళం వేసుకొని గదికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున ఆటో తీసేందుకు పార్కింగ్ ప్రాంతానికి రాగా వాహనం కనిపించలేదు. స్నేహితులను అప్రమత్తం చేయడంతోపాటు అన్నిచోట్లా వెతికాడు.
ఇదే విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. ఆటో వెనకాల బితిన్‌రాజ్‌యాదవ్ అనే పేరు ఉంటుందని ఎక్కడైనా కనిపిస్తే ఆచూకీ చెప్పాలని కోరాడు. పోస్టు చేసిన రెండు గంటల అనంతరం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.10 స్టార్ ఆస్పత్రి పక్క వీధిలో ఆటో ఉండడాన్ని చూసిన అతని స్నేహితుడు ఆటో గుర్తించడమే కాకుండా, ఆటో ఉన్న లోకేషన్‌ను పెట్టాడు. అప్రమత్తమైన బిపిన్ తదితరులు బంజారాహిల్స్‌కు వచ్చారు.
నేరుగా ఆటో వద్దకు వెళ్లి అందులో డ్రైవర్ సీటులో దర్జాగా కూర్చున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆటో తనదేనంటూ వ్యక్తి బుకాయించేందుకు ప్రయత్నించాడు. యువకులంతా కలిసి అతడిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. చోరీ బొల్లారం పోలీసుస్టేషన్ పరిధిలో జరగడంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కల్లురాం సమయస్ఫూర్తిని అందరూ అభినందించారు. మొత్తానికి వాట్సాప్ గ్రూప్‌లో విషయాన్ని షేర్ చేయడం.. అది దొరకడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.