లంచం కోసం పీడించింది… దొరికినంక ఏడ్చేసింది…

ACB Raids:లంచం కోసం డిమాండ్ చేయ‌డం.. ఆ త‌ర్వాత క‌న్నీరు కార్చ‌డం ఈ మ‌ధ్య అవినీతి అధికారులకు కామ‌న్ అయిపోయింది.. ఓ వైపు ఏసీబీ దాడులు.. మ‌రోవైపు అధికారుల లంచాలు మాత్రం ఆగ‌డం లేదు. ఇన్ని రోజులు కేవ‌లం పురుష అధికారులు మాత్ర‌మే ఏసీబీకి చిక్కేవారు.. ఇప్పుడు మ‌హిళా అధికారులు సైతం తామేమీ త‌క్కువ తిన‌డం లేద‌ని నిరూపిస్తున్నారు. తాజాగా ఓ మహిళా అధికారి ఏకంగా రూ.నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. వారు ప‌ట్ట‌కున్నాక భోరున విల‌పించింది…

హైదరాబాద్ (Hyderabad)​ శివారులోని నార్సింగి (Narsingi) మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల మంగళవారం వ‌ల‌ప‌న్ని పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ఓ వ్యక్తి ఎల్​ఆర్​ఎస్​ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్​ను క్లియర్​ చేయడానికి టౌన్​ ప్లానింగ్​ అధికారి మణిహారిక రూ. పది లక్షల లంచం డిమాండ్​ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం బాధితుడి నుంచి రూ. నాలుగు లక్షల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఆమెను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఆ త‌ర్వాత ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాల‌యంలో తనిఖీలు నిర్వహించారు. ఆమెపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న త‌ర్వాత మ‌ణిహారిక భోరున విల‌పించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like