సమ్మెతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి
నాలుగు బొగ్గుబావులను సింగరేణికి కేటాయించాలి - సమ్మెను విజయవంతం చేయండి
సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వెంటనే ఆపివేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నేతలు కోరారు. శనివారం సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అబ్బాపూర్ బీపీఏ ఓసి 2 లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుందని అది సరికాదన్నారు. ఆ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ బావులను యథావిధిగా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం డిసెంబరు 9, 10, 11 తేదీలలో జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ నాయకులు పేరం శ్రీనివాస్, ప్రకాష్ రావు, సోమారాపు తిరుపతి, పార్వతి సత్తయ్య, కృష్ణ మోహన్,శేషు,బయ్య మొగిలి, కోటేశ్వర్ రెడ్డి,సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.