ఎమ్మెల్యే వ్య‌తిరేక వ‌ర్గం… ర‌హ‌స్య స‌మావేశం…

బెల్లంపల్లి కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా..? ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వ్యతిరేకంగా నేతలంతా ఒక్కతాటిపైకి వస్తున్నారా..? బయటకు మాత్రం అంతా సైలెంట్‌గానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం రాజకీయ లెక్కలు జోరుగా సాగుతున్నాయా..? ఓ వైపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు.. మరోవైపు భవిష్యత్‌ రాజకీయాలకు పావులు కదుపుతున్న నాయకులు..! ఈ క్రమంలోనే ఓ ఇంట్లో జరిగిన ‘రహస్య భేటీ’ ఇప్పుడు బెల్లంపల్లి కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపింది. ఇంతకీ ఆ సమావేశంలో ఏం జరిగింది..? ఎవరు ఎవరి వెంట ఉన్నారు..? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యూహం సిద్ధమైందా..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..!

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ కు వ్య‌తిరేకంగా ప‌లువురు నేత‌లు త‌మ గ‌ళం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు కోసం ప‌నిచేసిన వారిని ప‌ట్టించుకోకుండా కొత్త వారికి పెద్ద పీట వేస్తున్నార‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. అదే స‌మ‌యంలో గ‌తంలో ఎమ్మెల్యే బ‌రిలో నిల‌బ‌డి అధిష్టానం హామీ మేర‌కు విర‌మించుకున్న నాత‌రిస్వామి త‌న గ‌ళాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. ఏకంగా ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గం కాబోయే ఎమ్మెల్యే త‌మ నేత‌నే అంటూ సోష‌ల్‌మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నేప‌థ్యంలోనే రెండు రోజుల కింద‌ట ప‌లువురు నేతల ర‌హ‌స్య స‌మావేశం అయ్యారు.

స‌మావేశం అజెండా ఏంటంటే…?
ఇద్ద‌రు మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్లు, ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో పలు అంశాలు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్యే స్థానికంగా ఉండ‌క‌పోవ‌డం, బ‌య‌ట నుంచి వ‌చ్చిన వారు ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మావేశంలో ఉన్న నేత‌లు ఆరోపించారు. ఎమ్మెల్యే వినోద్ కార్యకర్తలు, నేతలను కనీసం పట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర‌వుతోంద‌ని…. వినోద్ ఎమ్మెల్యేగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కష్టమంటూ స‌మావేశంలో చ‌ర్చించారు. బెల్లంపల్లిలో పీఏల పాలన నడుస్తోందని దీంతో కాంగ్రెస్‌కు మ‌రింత న‌ష్టం జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించారు.

హామీ ఇచ్చి… ప‌ట్టించుకోలేదు…
తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే త‌న‌కు మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌ని బుజ్జ‌గించార‌ని కానీ, ఇప్పుడు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నాయ‌కుడు నాత‌రిస్వామి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ్డం వినోద్, వివేక్ నీకు ప‌ద‌వి ఇస్తామ‌ని అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌న పుట్టిన రోజు వేడుక‌లు చేసుకుంటే నాయ‌కుల‌ను రావొద్ద‌ని ఎమ్మెల్యే, ఆయ‌న పీఏలు ఫోన్లు చేయ‌డం ఏమిటని ప్ర‌శ్నించారు. స్థానికేత‌రుడైన ఎమ్మెల్యే ఇక్క‌డ పెత్త‌నం చేయ‌డం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చాలా మంది నేత‌లు మ‌న వెంటే…
ఆ స‌మావేశానికి దాదాపు ప‌ది మంది వ‌ర‌కు ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ‌లో అన్ని మండ‌లాల నుంచి పెద్ద ఎత్తున నేత‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని, ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌కు రాక‌పోయినా స‌రైన స‌మ‌యంలో మ‌న వెంటే ఉంటార‌ని స‌మావేశంలో నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగింది. ఎవ‌రు త‌మ వెంట వ‌స్తారు..? ఎవ‌రు ఎమ్మెల్యే వెంట ఉన్నార‌నే విష‌యంలో సైతం చ‌ర్చించుకున్న నేత‌లు కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ శాతం త‌మ వైపే ఉంటార‌ని తెల‌వ‌డంతో ఆనందం వ్య‌క్తం చేశారు.

మొత్తానికి బెల్లంపల్లి కాంగ్రెస్‌లో పైకి కనిపించేది ఒక్కటైతే.. లోపల నడుస్తున్న రాజకీయం మరొకటన్న చర్చ సాగుతోంది. రహస్య సమావేశాలు.. బహిరంగ విమర్శలు.. సోషల్ మీడియాలో భవిష్యత్ నాయకత్వంపై ప్రచారం.. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు సొంత పార్టీ నుంచే సవాళ్లు పెరుగుతున్నాయన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రస్తుతం బెల్లంపల్లి కాంగ్రెస్‌లో ‘ఎవరు ఎటు?’ అన్న ప్రశ్నకు సమాధానం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

You might also like