బాధిత కుటుంబానికి ‘పీఎంజేజేబీవై’ భరోసా..

రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ (PMJJBY) పథకం ఓ పేద కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. అనారోగ్యంతో మరణించిన మహిళ కుటుంబానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆర్‌బీఐ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (CFL) సంయుక్త ఆధ్వర్యంలో రూ. 2 లక్షల బీమా పరిహారాన్ని అందజేశారు.

తాండూరు మండ‌లం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన చించు మహేశ్వరి అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీఎంజేజేబీవై (PMJJBY) పథకం కింద బీమా చేయించుకున్నారు. దీంతో ఆమె నామినీగా ఉన్న సోదరుడు రవికి రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది. అచ్చులాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు రవి, అశోక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై.. ఈ బీమా చెక్కును, పత్రాలను నామినీకి అందజేశారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. అనుకోకుండా కుటుంబ పెద్దను లేదా సభ్యులను కోల్పోయిన పేద కుటుంబాలకు ఇలాంటి బీమా పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తాయన్నారు. కేవలం పీఎంఎస్‌బీవై (PMSBY) కింద నామమాత్రపు ప్రీమియంతో ఏడాదికి రూ.20, పీఎంజేజేబీవై కింద రూ.436 చెల్లించి ఈ పథకాల్లో చేరవచ్చని ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, కౌన్సిలర్లు అశోక్, రవి తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకుని బ్యాంకులో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత కల్పిస్తూ, బాధిత కుటుంబాలకు బీమా క్లెయిమ్‌లు సకాలంలో అందేలా కృషి చేస్తున్న సీఎఫ్‌ఎల్, ‘వీడ్స్’ సంస్థల సేవలను అభినందించారు.

బీమా డబ్బులు సకాలంలో అందేలా సహకరించిన సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లకు, బ్యాంక్ మేనేజర్ కు, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ కు, ఆర్బీఐ అధికారులకు నామినీ రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

You might also like