ఆ కండక్టర్ మృతి
చిల్లర విషయంలో జరిగిన వివాదంలో ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను బస్సులోంచి తోసేయడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పది రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. అక్టోబర్ 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సులో ప్రవళిక అనే కండక్టర్ తో మౌనిక అనే ప్రయాణికురాలు చిల్లర విషయంలో గొడవ పెట్టుకుంది.. మౌనిక తన కుమారుడుకి టికెట్ కోసం రూ.100 ఇవ్వగా.. కండక్టర్ ఆమెకు టికెట్ ఇచ్చి మిగతా చిల్లర తర్వాత ఇస్తానని చెప్పింది.
మౌనిక మాత్రం తనకు వెంటనే చిల్లర ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదంకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఒకరినొకరు నెట్టుకోవడంతో కండక్టర్ బస్సులోంచి జారి పడిపోయింది. దీంతో ఆమె కాళ్లపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రవళికను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తండ్రి వారసత్వ ఉద్యోగం చేస్తూ..
ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసిన తండ్రి నాగరాజు మృతి చెందడంతో వారసత్వంగా పది నెలల కిందట ప్రవళికకు కండక్టర్ ఉద్యోగం వచ్చింది. త్వరలోనే ఆమెకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవళిక మరణంతో మణుగూరులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆమె కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా
మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రవళిక ఆరోగ్యం మెరుగుపడి తిరిగి కోలుకొని వస్తారని ఆశించామని పేర్కొన్నారు. అయితే ఆమె మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ప్రవళిక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.