ఇటలీ సంతతి వాళ్లు.. ఇక్కడ ప్రధాని కావాలని కలలు కంటున్నారు
నిర్మల్ గడ్డ కాషాయ అడ్డా అని ఉద్ఘాటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. నిర్మల్లో జరిగిన బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్, ఇండీ కూటమి లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ ఓటర్ల ఏరివేత, సీఏఏ, ఎన్ఆర్సీ అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ నిర్ణయాలను దేశ పౌరులే తీసుకుంటారని, అక్రమ చొరబాటుదారులను తరిమికొడతామని హెచ్చరించారు.
నిర్మల్ వేదికగా జరిగిన బీజేపీ మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని ఒక రాక్షస సేనగా అభివర్ణించిన ఆయన, ఆ పార్టీ నేతలు వేసే నిందలను ప్రధాని మోదీ గరళ కంఠుడిలా భరిస్తున్నారని అన్నారు. పీవీ నరసింహారావు, ఎమ్మెస్సార్ వంటి నాయకులు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓటర్ల జాబితాలో ఉండటంపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి దొంగ ఓట్లను, చనిపోయిన వారి ఓట్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇటలీ సంతతి వాళ్లు దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి చట్టాలపై కనీస అవగాహన లేదని విమర్శించారు. దేశ ప్రధానిని, ఎంపీ, ఎమ్మెల్యేలను ఈ దేశ పౌరులే నిర్ణయిస్తారని.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాంటి దేశాల నుంచి వచ్చిన వారు నిర్ణయిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిని బట్టలూడదీసి కొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఏఏ, ఎన్ఆర్సీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, ఆ పార్టీని తరిమికొట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. అమిత్ షా పాదయాత్ర చేస్తే లక్షలాది మంది తరలివచ్చి మద్దతు పలికారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను, రామచంద్రరావు వందనం చేస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కించపరుస్తూ ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లాసులో మద్యం పోసే కల్చర్, ఢిల్లీ పెద్దలకు డబ్బు సంచులు పంపే సంస్కృతి తమకు లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ఉరికించి కొట్టే రోజులు రాబోతున్నాయని తీవ్ర హెచ్చరికలు చేశారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని బండి సంజయ్ విమర్శించారు. కరెంట్ లేక, నీళ్లు లేక, పెన్షన్లు, ఉద్యోగాలు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోయి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తీరు మారకపోతే త్వరలోనే ఎన్ఆర్సీని తీసుకొచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై ఇక రంగు రంగుల జెండాలకు తావులేదని, రాష్ట్ర ప్రజలంతా కాషాయ జెండానే కోరుకుంటున్నారని తెలిపారు. రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని తప్పక అధికారంలోకి తీసుకొస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.