అధిక ధరకు బియ్యం అమ్మితే కఠిన చర్యలు
-సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాసంస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బియ్యం అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల శ్రీనాథ్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి అమ్మవద్దని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బి.పి.టి, హెచ్.ఎం.టి. తదితర రకాల బియ్యం ప్రభుత్వ నిర్దేశిత ధరలకు అందించేందుకు గజానన్ ఇండస్ట్రీస్ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయాలు జరిగేలా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు. 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. రా రైస్ బ్యాగ్ 1,430 రూపాయలు, హెచ్.ఎం.టి స్టీమ్ రకం బియ్యం బస్తా 1,898 రూపాయల చొప్పున విక్రయాలు జరుపుతామని నిర్వాహకులు తెలిపారు.
పట్టణంలోని చున్నంబట్టివాడ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జైపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు.