ఉపాధ్యాయుల కృషి అభినందనీయం

జిల్లా కలెక్టర్ కె.హరిత

విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో ఎస్.సి. కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయుల వ్యవహారశైలిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యం, విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. విద్యార్థులు చక్కగా చదవడం, ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న కంప్యూటర్ తరగతులను పరిశీలించి, కంప్యూటర్ విద్యపై విద్యార్థులకు ఉన్న ఆసక్తిని గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు కంప్యూటర్ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత గమనించారు. విద్యార్థులకు ప్రతి రోజూ నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి వారితో మాట్లాడారు. పాఠశాలలో విద్యాబోధన, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.  ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

You might also like