రిమ్స్ ఆసుపత్రిలో చోరీ!
-ఆర్.ఐ.సీ.యూ వార్డులోకి చొరబడి 4 వెంటిలేటర్ల అపహరణ
-చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.30 లక్షలు
-సీసీ కెమెరాల్లో రికార్డైన దొంగల దృశ్యాలు..
-ఘటనను గోప్యంగా ఉంచిన రిమ్స్ అధికారులు.. ఆలస్యంగా వెలుగులోకి..!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత గాలికి వదిలేశారు. సామాన్యుల ప్రాణాలు నిలబెట్టాల్సిన అత్యవసర వైద్య పరికరాలు దొంగల పాలవుతున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో జరిగిన చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఏకంగా ఆర్.ఐ.సీ.యూ వార్డులో చొరబడిన దుండగులు.. పట్టపగలే వెంటిలేటర్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగి చాలా రోజులవుతున్నా ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ డొల్లతనం బయటపడింది. గత నెల 30న మిట్ట మధ్యాహ్నం ఆసుపత్రిలోని ఆర్.ఐ.సీ.యూ (RICU) వార్డులోకి దొంగలు దర్జాగా ప్రవేశించారు. ఏకంగా నాలుగు వెంటిలేటర్లనుఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన ఈ నాలుగు వెంటిలేటర్ల విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. యంత్రాలను దుండగులు తీసుకెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.
పట్టపగలే చోరీ జరిగినా రిమ్స్ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ, గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.