కాసేపట్లో మీడియా ముందుకు మల్లోజుల
Maoist Party Politburo member Mallojula Venugopal Rao:మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను కాసేపట్లో మీడియా ముందుకు తీసుకురానున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట కాసేపట్లో లొంగుబాటు చూపనున్నారు. భారీసభ ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వం ఆయన లొంగుబాటును చూపుతోంది. వేణుగోపాల్‌తో పాటు సుమారు 60 మంది మావోయిస్టు క్యాడర్ కూడా పోలీసుల వద్ద తమ ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోయారు.
తాము తాము ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధమని మల్లోజుల వేణుగోపాల్ చేసిన ప్రతికా ప్రకటన సంచలనం సృష్టించింది. ఆయన నిర్ణయానికి ఛత్తీస్‌గఢ్‌తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని కేడర్లు మాత్రమే మద్దతు తెలిపాయి. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని మల్లోజుల చేసిన ప్రకటనతో మావోయిస్టు కేడర్‌లో ఒక రకంగా అయోమయం సృష్టించింది. మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతు ఇచ్చినా.. మల్లోజుల లేఖను పీఎల్జీఏ చీఫ్ హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల కిందట మల్లోజుల మరో లేఖను విడుదల చేశారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరారు.
మల్లోజుల ప్రస్థానమిది..
1956లో జన్మించిన వేణుగోపాల్‌రావు… మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీకి సోదరుడు. ఐటీఐ చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూలో చేరి, కమ్యూనిస్టు భావజాలాన్ని అలవర్చుకున్నారు. తన అమ్మమ్మ స్వగ్రామమైన కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటలో తన సోదరుడు కోటేశ్వర్రావు, బుర్ర చిన్నన్న తదితరులతో కలిసి కూనారం దొరలకు వ్యతిరేకంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి, ఉద్యమించారు. అప్పటికే ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు పీపుల్స్‌వార్‌లో ఉండడంతో వేణుగోపాల్ కూడా 1981-82ప్రాంతంలో అదే పీపుల్స్ వార్‌లో చేరారు. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి, సోనూ, మాస్టర్, అభయ్, సాధన వంటి పేర్లతో పనిచేశారు.
గెరిల్లా జోన్ నియామకంలో క్రియాశీలక పాత్ర..
మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలోని మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేశారు. అలాగే గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్‌ను నియమించడంతో క్రియా శీలక పాత్ర పోషించారు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణించిన తర్వాత మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. 2010 ఏప్రిల్‌లో దంతెవాడలో జరిగిన ఘటనలో 76 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మరణం వెనుక వేణుగోపాల్‌రావు హస్తం ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన లాల్‌గఢ్ ఉద్యమానికి వేణుగోపాల్‌రావును నాయకుడిగా అప్పట్లో పార్టీ నియమించింది.