బీజేపీ కార్యాలయంలో బీసీ నేతల ఘర్షణ
BJP BC leaders fight: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎదుట బీసీ సంఘాల నేతలు బాహాబాహీకి దిగారు. జూనియర్, సీనియర్ వివాదం తలెత్తడంతో నేతలు ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు.
ఈ నెల 18న బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించ తలపెట్టిన బంద్‍కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచందర్‌రావుతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయి ఉండి ఫొటోలకు ఎలా ముందుకు వెళ్తావని ఒకరినొకరు తిట్టుకుంటూ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలను మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.