తుపాకీ అందించి.. రాజ్యాంగం అందుకుని..
ఆయుధం భుజాన లేకపోతే అడుగు ముందుకేయరు… ఆయుధం వారి శరీరంలో ఒక భాగం.. అన్యాయం ఎదిరించాలని, రాజ్యంతో పోరాటం చేయాలని ఆయుధం అందుకున్నారు. చాలా మంది ఆ ఆయుధం పట్టుకుని ప్రాణాలు సైతం వదిలేశారు. మావోయిస్టు పార్టీలో చేరి ఆయుధం అందుకున్న తర్వాత అది భుజాన మోస్తునే ఉండాలి….
మావోయిస్టు ఉద్యమంలో 40 ఏళ్లకు పైగా అజ్ఞాతవాసంలో గడిపిన అగ్రశ్రేణి ఉద్యమ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ (70) అలియాస్ భూపతి మరో 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తన ఆయుధాన్ని అప్పగించారు. ఆయన ఆయుధం అప్పగించగానే సీఎం ఫడ్నవీస్ వేణుగోపాల్‌కు రాజ్యాంగాన్ని అందించారు. రాజ్యాంగం ప్రకారం నడిచే ఈ రాజ్యాన్ని నిత్యం విమర్శించే మావోయిస్టు నేత తుపాకీ వీడి అదే రాజ్యాంగం అందుకోవడం గమనార్హం.
ఈ విధంగా ఆయన రాజ్యంగం అందుకోవడం పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం నడుస్తోంది. ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవడం ఆహ్వానించదగిన పరిమాణమని, తుపాకీ వదిలిన చేతులకు రాజ్యాంగ పుస్తకాన్ని అందించటం ద్వారా తుపాకీ కంటే రాజ్యాంగమే శక్తివంతమైనది చెప్పకనే చెప్పినట్లయిందని కొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రజలకు మేలు చేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నిరసనలు, పౌర ఉద్యమాలు, ఎన్నికల్లో పోటీ చేయడం, అసెంబ్లీ, పార్లమెంటు వేదికలుగా ప్రజా గళం వినిపించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్న దేశంలో హింసాత్మక మార్గం అవలంభించే మావోయిజానికి తావు లేదని, ప్రస్తుత కాలంలో అంత అవసరం కూడా లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇక కొందరు బీజేపీకి చెందిన వారు రాహుల్‌ను ట్రోల్ చేస్తూ రాహుల్‌జీ రాజ్యాంగం గౌరవించే విధానం ఇదంటూ పోస్టులు పెట్టారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతమైన హింసకు ఇక్కడ చోటు లేదని స్పష్టం చేస్తున్నారు.