సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు
తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్పీని కొట్టేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంసుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ల స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన నిర్ణయంపై స్టే విధించేందుకు దేశ అత్యోన్నత న్యాయస్థానం నిరాకరించింది.