అరెస్టులొద్దు… విచార‌ణ ఆపొద్దు..

-ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో నిందితుల‌ను అరెస్టు చేయ‌వ‌ద్ద‌ని కోర్టు తీర్పు
-బీజేపీ పార్టీ ఏం నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే దానిపై ఉత్కంఠ
-పార్టీ త‌ర‌ఫున లాయ‌ర్ల‌ను పెట్టి డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లాలంటున్న కార్య‌క‌ర్త‌లు
-అవ‌ర‌స‌మైతే సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళితేనే ధీమా ఉంటుంద‌ని వెల్ల‌డి

Madhukar Suicide Case:బీజేపీ వేమ‌న‌ప‌ల్లి మండ‌ల అధ్య‌క్షుడు ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసు విష‌యంలో నిందితుల‌ను అరెస్టు చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టు తీర్పునిచ్చింది. అదే స‌మ‌యంలో కేసు విచార‌ణ సైతం ఆపొద్ద‌ని… నిందితులు విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో త‌మ‌పైన న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాల‌ని నిందితులుహైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. వేమ‌న‌ప‌ల్లి మండ‌లం నీల్వాయికి చెందిన కాంగ్రెస్ నేత రుద్ర‌భ‌ట్ల సంతోష్, ఇత‌రులు క‌లిసి ఈ పిటిష‌న్ వేశారు. ఈ నేప‌థ్యంలోనే హైకోర్టు నిందితులను అరెస్టు చేయ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది.

వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్‌ కాంగ్రెస్‌ నేతల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్‌ రాసి వారం రోజుల కింద‌ట ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ‘రుద్రభట్ల సంతోష్‌, గాలి మధు, చింతకింది కమల రాజకీయంగా ఎదుర్కొనలేక నాపై తప్పుడు కేసులు పెట్టించి నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసి నా చావుకు కారణమయ్యారు. వీళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల’ని మధుకర్ సూసైడ్ లెట‌ర్‌లో రాశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద్ర‌రావు నీల్వాయికి వ‌చ్చి మ‌ధూక‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నీల్వాయి వ‌చ్చారు. 48 గంట‌ల్లో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేక‌పోతే బీజేపీ త‌ర‌ఫున ఉద్య‌మం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు సైతం వ‌చ్చి రామ‌గుండం క‌మిష‌న‌ర్‌కు వినతిప‌త్రం స‌మ‌ర్పించారు.

డివిజ‌న్ బెంచ్‌లో అప్పీలు చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల విజ్ఞ‌ప్తి
కాంగ్రెస్ నాయ‌కుల స్క్వాష్ పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో సింగిల్ జ‌డ్జి తీర్పును స‌వాల్ చేస్తూ డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లాల‌ని బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. పార్టీలోనే ఎంపీ రఘునంద‌న్ రావు, రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు రాంచంద్ర‌రావు సైతం స్వ‌యంగా లాయ‌ర్లు కావ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లో నిందితుల‌ను వ‌ద‌లొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అధికార పార్టీ అరాచ‌కాలు ఈ విధంగా కొన‌సాగితే భ‌విష్య‌త్తులో పార్టీలో ఎవ‌రు ఉండ‌ర‌ని చెబుతున్నారు. అవి త‌గ్గాలి అంటే నిందితుల‌కు ఖ‌చ్చితంగా శిక్ష ప‌డాల‌ని ఈ విష‌యంలో పార్టీ తీవ్రంగా ఆలోచించాల‌ని కోరుతున్నారు.

అవ‌స‌రం అయితే సుప్రీం కోర్టుకు..
ఒక‌వేళ హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌లో సైతం ఇలాంటి తీర్పే వ‌స్తే సుప్రీం కోర్టుకు సైతం వెళ్లాల్సిందేన‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు. ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్యకు ప్రేరేపించిన వారిని వ‌దిలిపెడితే రేపు ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రిన్ని జ‌రుగుతాయ‌ని అందుకే వారిని వ‌ద‌లొద్దంటూ బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ విష‌యంలో అధిష్టానం తీవ్రంగా ఆలోచించాల‌ని చెబుతున్నారు. మ‌రి పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాలి…

Get real time updates directly on you device, subscribe now.

You might also like