మ‌ల్లోజుల‌, ఆశ‌న్న విప్ల‌వ ద్రోహులు..

మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Sensational letter from Maoist party:మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న విప్లవ ద్రోహులని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. వారికి ప్రజలే తగిన శిక్ష విధించాలని, తన్ని తరిమేయాలని పిలుపునిచ్చింది. పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపించింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రాణభీతి ఉన్నవారెవరైనా లొంగిపోవచ్చని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని కోరింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుద‌ల చేశారు.

మల్లోజుల, ఆశన్న కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారి అనుచరులతో కలిసి లొంగిపోయారని లేఖలో పేర్కొంది. వారు విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకారులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా అభివర్ణించింది. శత్రువులకు లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న బృందాలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. 2011 చివరి నుంచి విప్లవోద్యమం గడ్డు స్థితి ఎదుర్కొంటూ వస్తోంది. 2018లో మవోయిస్టు పార్టీ ఒకసారి తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో.. మల్లోజుల దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై.. సొంత విశ్లేషణలతో నిర్దారించి ఒక పత్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది.

ఆ తర్వాత ఎప్పటికప్పుడూ జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో.. ఆయన తప్పుడు రాజకీయ భావనలను పార్టీ విమర్శించింది. అనంతరం ఆయన్ను పార్టీ సరిదిద్దడానికి కృషి చేసింది. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్లీనం.. మల్లోజుల వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని విమర్శించి వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. అయితే, 2025 మే నెలలో జరిగిన ఆపరేషన్ కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత మల్లోజులలో దీర్ఘకాలంగా ఉన్న సైద్దాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయని అభయ్ లేఖలో పేర్కొన్నాప.

“విప్లవానికి ద్రోహులుగా మారిన మల్లోజుల, ఆశన్నల ముఠా.. సరైన మార్గంలో విప్లవ ఉద్యమాన్ని పునర్మిస్తామనడం బూటకం. వాళ్లు కేంద్ర, రాష్ట్ర ఇంటజిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు, నిర్మించే విప్లవ ఉద్యమం.. ప్రభుత్వ ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా, విప్లవ ఉద్యమంగానే ఉంటాయి. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజాపోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే.. వారిని తన్నితరమాల్సిందిగా పిలుపునిస్తున్నాం. కగార్ యుద్ధంతో ప్రాణభీతి ఉన్నవారు ఎవరైనా.. లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాలను శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నాం. అది విప్లవ ద్రోహమే కాకుండా విప్లవ ప్రతిఘాతకత అవుతుంది. విప్లవ ప్రతిఘాతకులను.. శిక్షించక తప్పద”ని లేఖలో అభయ్ హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like