26 లక్షల దీపాలు… రెండు ప్రపంచ రికార్డులు
26 Lakh Lamps… Two World Records.. Deepotsav in Ayodhya: అయోధ్య నగరం పులకించిపోయింది.. 26 లక్షల దీపాలతో వెలిగిపోయింది.. రెండు ప్రపంచ రికార్డులకు వేదికైంది… దీపావళి సందర్భంగా అయోధ్య నగరంలో ప్రతి ఏడులాగానే ఈ ఏడాది కూడా దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.
దీపావళిని పురస్కరించుకొని అయోధ్యలో దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. సరయూ నది తీరాన 26 లక్షల దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులతో ఆ ప్రాంతమంతా స్వర్ణమయంగా మారింది. దీపోత్సవాన్ని వీక్షించడానికి పెద్దఎత్తున భక్తులు తరలిరాగా సరయూ నదీ తీర ప్రాంతాలు కిక్కిరిశాయి. అనంతరం ఏర్పాటు చేసిన లేజర్ షో, లైట్ షోలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 1100 డ్రోన్లతో చేపట్టిన ప్రదర్శన కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ దీపోత్సవం రెండు గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. 26,17,215 దీపాలను వెలిగించడం సహా ఎక్కువ మంది పురోహితులు సరయూ నదికి హారతి ఇవ్వడంతో గిన్నిస్ రికార్డు దక్కింది. దీపావళి సందర్భంగా బాల రాముని ఆలయాన్ని కూడా పూలతో అందంగా అలంకరించారు.
యోగి ఆదిత్యనాథ్ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలో ఉన్న కళాకారుల రథాన్ని లాగారు. దీపాలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీపోత్సవ్ విజయవంతం చేయడానికి వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన వేలాది మంది వాలంటీర్లు ఏకమయ్యారు. వాలంటీర్లు ఉదయం నుంచే దీపాలను సిద్ధం చేయడం, వాటికి వత్తులు, నూనె వేయడం, ఘాట్ల వెంట ఆకర్షణీయమైన నమూనాలలో అమర్చడం వంటి పనులలో నిమగ్నమయ్యారు. ఆన్లైన్లో షేర్ చేసిన వీడియోలు రామ్ కీ పైడీ వద్ద ప్రజలు ఉత్సాహంగా దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను చూపించాయి. సాయంత్రం వేళ, లక్షలాది దీపాల వెలుగు ఒకేసారి మెరుస్తూ, కనువిందు చేసే అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించింది.