ముగిసిన రియాజ్ అంత్యక్రియలు
Rowdysheeter Riyaz funeral : సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS constable Pramod) హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు కొద్ది సేపటి కిందట ముగిశాయి. రాత్రి రెండు గంటలకు పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం రియాజ్ శవాన్ని బంధువులకు అప్పగించారు. తెల్లవారుఝామున రియాజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
పలు కేసుల్లో నిందితుడైన రియాజ్‌ను బైక్ దొంగతనం కేసులో శుక్రవారం అరెస్టు చేసిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ద్విచక్రవాహనంపై అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, మార్గమధ్యలో ప్రమోద్ను పొడిచి చంపి రియాజ్ పరారయ్యాడు. అతన్ని ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. అయితే, తనని వెంబడిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రియాజ్ తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసుల నుంచి పారిపోతున్న తనని అడ్డుకోబోయిన ఓ యువకుడిపై కత్తితో దాడి కూడా చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పెనుగులాట జరగ్గా.. ఆసిఫ్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పెనుగులాటలో రియాజ్ కూడా పడిపోగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్‌తోపాటు ఆసిఫ్‌ను సైతం ఆస్పత్రికి తరలించారు.
సోమవారం ఉదయం కోర్టుకు తరలించాలని పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్దం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల వద్ద తుపాకీ తీసుకుని మరోసారి పోలీసులపై దాడికి ప్రయత్నించాడు రియాజ్. ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు.