ఆ పోలీసులపై హత్యానేరం మోపాలి
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్లో (Riyaz Encounter) ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారిపై హత్యా నేరం మోపాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. హైకోర్టు, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని న్యాయ విచారణ జరపాలని కోరింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా, వారికి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేసింది. కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్‌ని పోలీసులు చంపడం బూటకపు ఎన్కౌంటర్ అని స్పష్టం చేసింది.
హంతకునికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోకుండా పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో అతని నేరాన్ని నిరూపించి, చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయటానికి అవకాశాలున్నాయని వెల్లడించింది. పోలీస్ వ్యవస్థ రియాజ్‌ను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తున్నదని తెలిపారు. ముందస్తు పథకం ప్రకారమే పోలీసుల మీద మరొకరు తిరుగుబాటు చేయకుండా, రియాజ్ ఉదంతం ఒక బెదిరింపుగా ఉండాలని చేసిన కౌంటర్ హత్య అని మానవ హక్కుల వేదిక నేతలు అనుమానం వ్యక్తం చేశారు.