కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ
DGP visits constable’s family:రౌడీ షీటర్ రియాజ్ చేతిలో మృతి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్(Constable Pramod) కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) పరామర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు ఆర్థిక సాయం చెక్కుతో పాటు 300 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రమోద్ భార్య మాట్లాడుతూ.. డీజీపీ తమ కుటుంబానికి భరోసా ఇచ్చారని తెలిపారు. ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామన్నారని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా భర్త లేని లోటు తీర్చలేరు కానీ, మా కుటుంబానికి జరిగినట్లు మరో కుటుంబానికి జరుగకుండా టాస్క్‌కు వెళ్ళేటప్పుడు పోలీసులకు ఆయుధాలు ఇవ్వాలని కోరారు. డీజీపీతో పాటు ఐజి చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయి చైతన్య సైతం కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.
అనంతరం, డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రియాజ్‌ను పట్టు కోవడంలో పోలీసులకు సహకరించి గాయపడ్డ ఆసీఫ్‌కు రూ. 50 వేల రివార్డు అందించామన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్‌పై విచారణకు ఆదేశించామని, డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నట్లు వెల్లడించారు.