చెక్‌పోస్టులను మూసివేయండి..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులు మూసివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
చెక్‌పోస్టుల్లో అవినీతి రవాణా..
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్ పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని రవాణాశాఖ చెకోపోస్టులను రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నెలరోజులు అలస్యంగా జీఓ జారీ అయ్యింది. ఉత్తర్వులు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా చెకోపోస్టులను ఇంకా తొలగించలేదు. వాటి స్థానంలో ఏఎన్పీఆర్ కెమెరాలు పెట్టాలని నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా రవాణాశాఖలోనే కొందరు వ్యూహాత్మకంగా ప్రక్రియను అలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధకశాఖ (ఏసీబి) రాష్ట్రవ్యాప్తంగా చెకపోస్తులపై తాజాగా దాడులు చేయడం అక్కడి అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోంది.
అధికారుల ఒత్తిళ్లతోనే…
జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్ పోస్టుల అవసరం తగ్గిపోయింది. కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెకోస్టులను రద్దు చేశాయి. కానీ మన రాష్ట్రంలోనే నేటికీ కొనసాగుతున్నాయి. ఏడాదిన్నర కిందటే తెలంగాణలో చెక్‌పోస్టుల రద్దుకు రవాణాశాఖ నిర్ణయం తీసుకున్నా.. కొందరు అధికారుల ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు నెలల క్రితం జీఓ జారీ అయినా అవినీతి అధికారుల తీరు మారలేదు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 15 రవాణాశాఖ చెక్ పోస్టులుంటే పన్నెండు చోట్ల ఏసీబీ తాజాగా దాడులు జరిపింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇన్నిచోట్ల ఒకేసారి దాడులు జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో మరోసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.