ఫోన్లు పేలాయి… ప్రాణాలు తీశాయి..
Kurnool Bus Accident: బస్సు లగేజీ విభాగంలో 400 ఫోన్లు ఉన్న పార్సిల్ ఉంది… బస్సు ప్రమాదానికి గురి కావడం… మంటలు వ్యాపించడం.. దీంతో ఆ ఫోన్లలో ఉన్న లిథియం బ్యాటరీలు(Lithium batteries) ఒక్కసారిగా పేలిపోయాయి. ప్రమాద తీవ్రతను ఇది మరింతగా పెంచిందని ఫోరెన్సిక్ బృందాలు చేసిన ప్రాథమిక పరిశీలనలో బయటపడింది…
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Bus Fire accident) దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి కావడంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం, బస్సు ముందుగా ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సు ఆయిల్ ట్యాంక్ మూత ఊడి, పెట్రోల్ కారడం ప్రారంభమైంది. బైక్ బస్సు కింద చిక్కుకుని కొంత దూరం అలానే వెళ్లింది.ఈ క్రమంలో ఘర్షణతో నిప్పురవ్వలు చెలరేగాయి. అవి పెట్రోల్‌కి అంటుకోవడంతో బస్సు దిగువ భాగం ఒక్కసారిగా మంటల్లో కూరుకుపోయింది.
ఒక్కసారిగా పేలిన లిథియం బ్యాటరీలు..
బస్సు లగేజ్ విభాగంలో 400కి పైగా మొబైల్ ఫోన్ల పార్సిల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంటలు అక్కడికి చేరగానే లిథియం బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ పేలుళ్లతో మంటలు మరింత తీవ్రమై, ప్రయాణికుల విభాగం వరకు వ్యాపించాయి. దీంతో బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారు మంటల్లో సజీవ దహనం అయ్యారు.’ అని అధికారులు వివరించారు. ఆ స్థలంలో పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, ఫోరెన్సిక్ బృందాలు అది మొబైల్ బ్యాటరీలు(Mobile Batteries) పేలుళ్ల కారణం అని నిర్ధారించాయి. లిథియం బ్యాటరీలు మంటల్లో ఉన్నప్పుడు భారీ ఉష్ణోగ్రత ఉత్పత్తి చేస్తాయని… దీంతో ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ శబ్దం ఏర్పడిందని వారు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా..
ప్రయాణికుల బస్సుల్లో లగేజ్ తప్ప ఇతర వస్తువులను తరలించరాదు అనే నిబంధన ఉన్నప్పటికీ, అనేక ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఈ బస్సు కూడా సరుకు రవాణా చేయవద్దని కానీ ఇందులో సరుకు రవాణా జరుగుతోందని అధికారులు తేల్చారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులకు బయటకు వచ్చే సమయం దొరకలేదు. బస్సు ప్రధాన ద్వారం తెరుచుకోకపోవడం దుర్ఘటన తీవ్రతను మరింత పెంచింది. చివరికి కొందరు అద్దాలు Mirrors పగులకొట్టి బయటపడ్డారు. అయితే బస్సు ముందు భాగంలో ఉన్న వారు ఎక్కువగా మరణించారు. లిథియం బ్యాటరీలు ఉన్న వస్తువులు ప్రయాణికుల వాహనాల్లో తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరం” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ట్రాన్స్పోర్ట్ శాఖ బస్సు యాజమాన్యాలపై విచారణ ఆదేశించింది.