ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లపై అన్నదాత ఆగ్రహం
Farmers’ anger over cotton purchases:పత్తి కొనుగోళ్ల ప్రారంభం రోజులే రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు(Adilabad Market Yard)లో రైతులు పెద్ద ఎత్తున పత్తి అమ్మేందుకు తీసుకువచ్చారు. సీసీఐ(CCI) మద్దతు ధర రూ. 8, 110 కాగా, ప్రైవేట్ లో క్వింటాల్ పత్తి ధర రూ. 6,950 గా నిర్ణయించారు. అయితే, అధికారులు తేమ ఎక్కువగా ఉందని పత్తిని తిరస్కరిస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. తేమశాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని కాంటాల వద్ద బైఠాయించారు. తేమ నిబంధనల ప్రకారం పత్తి తీసుకొస్తే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే తేమ శాతం నిబంధనల కంటే ఎక్కువగా వచ్చినా కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేశారు.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఉదయం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తేమ శాతం తో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఏ నిర్ణయం తీసుకోకుండానే మార్కెట్ నుంచి అధికారులు, ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. దీంతో మార్కెట్ యార్డులో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. యార్డు నిండా పత్తి తీసుకొచ్చిన వాహనాలతో నిండిపోయింది. దాదాపు ఆరు వందల వాహనాలతో మార్కెట్ యార్డు నిండింది.
దీంతో అధికారుల బృందం వెళ్లి కలెక్టర్ తో చర్చించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah), ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) మార్కెట్ యార్డుకు వచ్చారు. తేమ నిబంధనలు లేకుండా క్వింటాల్ కు రూ. 6,950 చొప్పున ప్రైవేట్ వ్యాపారులతో కొనుగోలు చేయిస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రకటించారు. లేదంటే 12 లోపు తేమ శాతం వచ్చే వరకు జిన్నింగ్ లలో ఆరబెట్టు కోని రేపు అమ్మకానికి తీసుకొచ్చే వెసులు బాటు కల్పిస్తామని ఈ విషయంలో రైతులనే నిర్ణయించుకోమని చెప్పి అధికారులు వెళ్లిపోయారు.