ఆర్ఎస్యూ నుంచి అగ్రనాయకుడి దాకా..
Maoist Party:ఆర్ఎస్యూతో పరిచయం… అది కాస్తా అడవిలోకి తీసుకువెళ్లింది… 45 ఏండ్ల పాటు సాయుధ పోరాటానికి కారణమైంది… ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలనే చర్చ సందర్భంగా చావో రేవో తేల్చుకోవాలని పిలుపునిచ్చి ఆయనే లొంగిపోవడం అటు పోలీసులను, ఇటు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. కొద్ది రోజులుగా బండి ప్రకాష్ లొంగుబాటు చర్చ సాగుతుండగా, చివరి నిమిషం వరకు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న(Pulluri Prasad Rao@Chandranna) లొంగుబాటు గోప్యంగా కొనసాగింది. ఆయన లొంగిపోయిన తర్వాత కూడా తమది లొంగుబాటు కాదని, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఎస్ యూతో పరిచయం..
పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్ కు చెందిన వారు. ఆయన తండ్రి శ్రీనివాస్‌రావు హెడ్మాస్టర్గా పనిచేసేవారు. 1978లో పదోతరగతి పూర్తి చేసిన చంద్రన్న 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. అప్పుడే రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్ దగ్గు రాజలింగుతో పరిచయం ఏర్పడింది. రాజలింగు బోధనలతో ప్రభావితుడైన చంద్రన్న RSUలో చేరి విప్లవ పంథావైపు అడుగులు వేశారు. 1980లో ఇంటర్ పూర్తి చేసిన చంద్రన్న మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ(Mallojula Koteshwar Rao@Kishan Ji)కి కొరియర్ గా పని చేశాడు. చంద్రన్నతో పాటు మరో ఇద్దరిని 1980 జులైలో చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్దల్ పూర్ జైలులో ఉన్న చంద్రన్న అదే సంవత్సరం డిసెంబర్ లో బయటకు వచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో అనుబంధం..
ఆయన బయటకు వచ్చిన తరువాత తెలంగాణలోని ఆసిఫాబాద్ దళంలో సభ్యునిగా పని చేశారు. 1981లో పీపుల్స్ వార్ ఆవిర్భావం తరువాత సిర్పూర్ దళ కమాండర్ గా 1983లో బాధ్యతలు చేపట్టారు. 1987 వరకు సిర్పూర్ దళ కమాండర్ గా పని చేసిన ఆయన డివిజనల్ కమిటీ సభ్యుడి బాధ్యతల్లో సిర్పూర్, చెన్నూరు ప్రాంత దళాల ఇంఛార్జిగా వ్యవహరించారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన చంద్రన్న 1995లో నార్త్ తెలంగాణ వెళ్లారు. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ఆనంద్ కార్యదర్శిగా వ్యవహరించిన ఈ కమిటీలో చంద్రన్నతో పాటు జినుగు నర్సింహ రెడ్డి అలియాస్ జంపన్న, సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ సభ్యులుగా పని చేశారు. 2006 వరకు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఇంచార్జిగా వ్యవహరించిన చంద్రన్న 2007లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
కేంద్ర కమిటీ బాధ్యతలు…
కేంద్రకమిటీ ప్రత్యామ్నాయ సభ్యునిగా కూడా వ్యవహరించిన ఆయన 2008లో పూర్తి స్థాయిలో సీసీ కమిటీ సభ్యునిగా చేరారు. 2021 జూన్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మరణించడంతో ఆ బాధ్యతలను కూడా చంద్రన్న చేపట్టారు. 2024 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావుకు అప్పగించిన తరువాత తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరించారు. 17 ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేసిన ఆయన అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో జనజీవన స్రవంతిలో కలిశారు.
మాది లొంగుబాటు కాదు… ప్రజల కోసం పనిచేస్తాం..
లొంగిపోయిన తర్వాత కూడా ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తమది లొంగుబాటు కాదని స్పష్టం చేశారు. మాది లొంగుబాటు కాదు అభివృద్ధిలో కలిసి పనిచేయడానికి వచ్చామని చెప్పారు. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశా… భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తానని, మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని, ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నానని తెలిపారు. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి అలియాస్ దేవ్ జీ ఎన్నుకున్నారని, దేవ్‌ని సపోర్ట్ చేస్తున్నానని, ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చానని వెల్లడించారు. జనంలో ఉంటూ జనం కోసం పని చేస్తామన్నారు.