నల్ల నేలపై ఎగిరిన రగల్ జెండా సికాస
ఎర్రపోస్టర్ పడిందంటే చాలు బొగ్గు పెల్ల బయటికి వచ్చేది లేదు.. లారీ పయ్య తిరిగేది లేదూ… కేవలం సిగరేట్ అట్టపెట్టె మీద రాసిస్తే చాలు బొగ్గుబాయిలన్నీ బంద్ పెట్టేది. కష్టాల్లో ఉన్న కార్మికులకు అండ అయ్యింది… నల్ల సూరీళ్ల బువ్వ అయ్యింది… కానీ, ఇప్పుడు దాని పరిస్థితి తారుమారైంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సికాస ఇప్పుడు దాదాపు కనుమరుగు అయ్యింది. ఇప్పుడు సింగరేణి కార్మిక సమాఖ్య ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాప్ ప్రభాత్ సైతం లొంగిపోవడంతో అది ఇక ముగిసిన అధ్యాయమే అని పలువురు చెబుతున్నారు.
మావోయిస్టు పార్టీ (అప్పటి పీపుల్స్ వార్) అన్ని రంగాల్లో తమ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా సింగరేణిలో సైతం సింగరేణి కార్మిక సమాఖ్య (సి.కా.స.) పేరుతో విస్తరించింది. సింగరేణిలో సికాస పేరు చెబితే చాలు బాయి దొరలకు వణుకుపుట్టేది. కార్మికుల హక్కుల కోసం పోరాటాల్లో ముందుండేది సికాస. ఎన్నో హక్కులను సైతం సాధించి పెట్టింది ఆ సంఘం. 70, 80 దశకాల్లో ఆ సంఘం గీసిన గీత దాటేవారు కాదంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ తర్వాత నిర్బంధం పెరగడంతో పాటు వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో సికాస ముఖ్యమైన నేతలను కోల్పోయింది. అయినప్పటికీ బండి ప్రకాష్ సికాస పేరుతో లేఖలు విడుదల చేస్తూ సంఘాన్ని నడిపించారు.
సింగరేణి ఉద్యోగం నుంచి సికాస దాకా..
రాష్ట్ర కమిటీ సభ్యునిగా, సింగరేణి కార్మిక సమాఖ్య ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాప్ ప్రభాత్ మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయనది మంచిర్యాల జిల్లా మందమర్రి. సింగరేణి ఉద్యోగి అయిన బండి దాదా మందమర్రిలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ రాడికల్ యూత్ (RYL)లో చురుగ్గా పని చేశారు. 1984లో చంద్రన్న నేతృత్వంలోని సిర్పుర్ దళంలో సభ్యునిగా పని చేసి ఆరు నెలల తరువాత స్వస్థలానికి చేరుకున్నారు. 1984లో సీపీఐ నాయకుడు అబ్రహం హత్యలో పాల్గొన్న బండివ ప్రకాష్ పోలీసులకు చిక్కకుండా కొత్తగూడెం ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఈ హత్య కేసులో ఆదిలాబాద్ జైలుకు వెళ్లారు.
విబేధించి.. సుతారి మేస్త్రీగా..
జైలులో బండి ప్రకాష్ కు మహమ్మద్ హుస్సేన్, నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ముంజాల రత్నయ్య గౌడ్ లతో పరిచయం ఏర్పడింది. జైలు నుండి పారిపోయిన ప్రకాష్ తిరిగి అజ్ఞాతంలోకి వెల్లి గంధం రాధస్వామి అలియాస్ సాగర్ నాయకత్వంలోని మంగి దళంలో చేరాడు. ఆరు నెలల తరువాత సిద్దాంతపరమైన విబేధాలు రావడంతో పార్టీని వీడి హైదారాబాద్ లో సుతారి మేస్త్రీగా జీవనం కొనసాగించారు. 1992లో అబ్రహం హత్య కేసులో తిరిగి పోలీసులు అరెస్ట్ చేయగా జీవిత ఖైదీగా శిక్ష పడింది. 2004 ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా బండి ప్రకాష్ కు శిక్ష నుండి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బయటకు వచ్చిన ఆయన పీపుల్స్ వార్ నాయకత్వంతో సంబంధాలు కొనసాగించారు. 2004లో శాంతి చర్చల సమయంలో డివిజనల్ కమిటీ సభ్యునిగా, NTSZC తరపున చర్చల నిర్వహణ కమిటీ సభ్యునిగా పార్టీ బాధ్యతలు అప్పగించింది. శాంతి చర్చలు విఫలం అయిన తరువాత చత్తీస్ గడ్లోని బీజాపూర్ జిల్లా ఊసూరు అటవీ ప్రాంతంలో NTSZC కార్యదర్శి జంపన్నను కలిసి సాయుధ పోరువైపు వెళ్లారు.
సికాస ఇన్‌చార్జీగా..
2015లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన బండి ప్రకాష్ కు సింగరేణి ప్రాంత కోల్ బెల్ట్ ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ప్రజా విముక్తి పత్రికకు సంపాదకుడిగా కూడా వ్యవహరించిన ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్ టీమ్ ఇంఛార్జిగా కూడా పని చేశారు. అప్పటి నుండి ప్రభాత్ పేరిట కార్యకలాపాలను కొనసాగించడం ఆరంభించారు. సింగరేణి కార్మిక సమాఖ్య (Singareni Labor Federation) మావోయిస్టు అనుబంధ సంఘాన్ని అంచలంచెలుగా విస్తరించి కార్మికుల హక్కులు సమస్యలపై తెర వెనుక నుండి పోరాటాలకు వ్యూహం రచించడంలో దిట్ట. ఇప్పటివరకు పోలీసులతో జరిగిన 9 ఎన్‌కౌంటర్ ఘటనల నుండి తప్పించుకుని పోలీసులకు పెద్ద సవాల్ గా మారాడు. అనారోగ్యం బారిన పడ్డ బండి తాజాగా మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయన లొంగుబాటుతో సింగరేణి కార్మిక సమాఖ్య ఇక ముగిసిన అధ్యాయమే అని పలువురు భావిస్తున్నారు.