పేకాట క్లబ్‌గా ఎక్సైజ్ స్టేషన్
Excise station as a poker club:ఎక్సైజ్ పోలీసులు తమ స్టేషన్‌ను ఏకంగా పేకాట క్లబ్‌గా మార్చేశారు. హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్నారు. ఏకంగా ఎక్సైజ్ స్టేషన్ నే పేకాట క్లబ్బుగా మార్చేశారు వారు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నిర్వాకం బయటపడింది. రాత్రి ఎక్సైజ్ స్టేషన్ మూసేసి ఓ హెడ్ కానిస్టేబుల్ తో సహా ఐదుగురు కాని స్టేబుళ్లు పేకాడుతున్న విషయం బయటకు వచ్చింది. బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్న వారే ఇలా పేకాట ఆడుతుండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతకాలంగా ఎక్సైజ్ స్టేషన్ లోనే ఈ వ్యవహారం సాగుతోందని పలువురు చెబుతున్నారు. కొందరు ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ కార్యాలయాన్ని పేకాట క్లబ్ మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరోసారి ఇలాంటి కార్యకలాపాలు పునరావృతం కాకుండా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు….