సీఐపై సస్పెన్షన్ వేటు
Telangana Police: శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జైపూర్ మండలం ఇందారం రైస్ మిల్లులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. వేలాది క్వింటాళ్ల ధాన్యం (సీఎంఆర్) కొనుగోలు చేసినట్లు చూపించి అందినకాడికి దండుకున్నారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం తెచ్చి, ఇక్కడి రైతుల నుంచి కొన్నట్లు చూపించి కోట్లాది రూపాయాల ప్రభుత్వ ధనాన్ని తమ బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఈ మేరకు విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ సాగింది..
ధాన్యం కొనుగోళ్లలో ఇందారం రైస్ మిల్లర్ రూ.1.39 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అధికారులతో పాటు, పోలీసులు సైతం ఉన్నారనే విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీంతో అటు వైపుగా దృష్టి సారించి విచారణ చేయించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవడంతో భారీగా అక్రమాలు బయటకు వచ్చాయి. ఇందారం సుముఖ ఆగ్రో ఇండస్ట్రీ యజ మానులతో పాటు మండల వ్యవసాయాధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి, డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులు సహా మరో ఎనిమిది మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదే వ్యవహారంలో అవినీతికి సంబంధించి డీలర్ శ్రీనివాస్, ఆయన కొడుకును తప్పించే ప్రయత్నాలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు సీఐపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.