సింగ‌రేణికి అరుదైన ఆహ్వానం

-త‌మ దేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆహ్వానించిన ఘ‌నా ప్ర‌తినిధి బృందం
-వజ్రాలు, బంగారం, ఖ‌నిజాల త‌వ్వ‌కాల్లో పెట్టుబ‌డులకు ఆహ్వానం
-బొగ్గు మైనింగ్ కు సింగరేణి సహకారాన్ని కోరిన బృందం
-త‌మ దేశానికి సింగ‌రేణి బృందాన్ని పంపాల‌ని కోరిన ప్ర‌తినిధులు
-సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్‌తో ప్ర‌తినిధుల బృందం భేటీ
-సానుకూలంగా స్పందించిన సింగ‌రేణి యాజ‌మాన్యం
-సింగరేణి విస్తరణలో ఇది ఒక శుభపరిణామమ‌న్న సీఎండీ బ‌ల‌రామ్

Singareni: ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేర్కొనే రిపబ్లిక్ ఆఫ్ ఘనా (Republic of Ghana) దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శనివారం ఘనా దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్(Singareni Company CMD N. Balaram) తో సమావేశమై పలు వ్యాపార అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఘనా దేశ ప్రతినిధి బృందం మాట్లాడుతూ తమ దేశంలో ఖనిజ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని, ఈ విషయంలో అపార అనుభవం గల సింగరేణి సంస్థకు స్వాగతం పలుకుతున్నామన్నారు.

తమ దేశంలో ప్రధానంగా వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్ , లిథియం వంటి పలు ఖనిజాల తవ్వకం, ఉత్పత్తులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటామన్నారు. ఉత్పత్తి పెంచడానికి అవసరమైన పెట్టుబడులను ఆహ్వానించడం కోసం వచ్చామని తెలిపారు. మైనింగ్ లో ఎంతో అనుభవం ఉన్న సింగరేణి సంస్థ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. తమ దేశంలో బొగ్గు మైనింగ్ కూడా ఉందని, ఇందులోనూ సింగరేణి సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

సీఎండీ ఎన్.బలరామ్ స్పందిస్తూ సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా విదేశాల్లో ఇతర ఖనిజాలు, కీలక ఖనిజ రంగాల్లో కూడా ప్రవేశించాలని ఇప్పటికే నిర్ణయించి ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఘనా దేశంలో కూడా మైనింగ్ జరపటానికి గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు. కీలక ఖనిజ తవ్వకాలకు అవకాశం ఉంటే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నెల రోజుల్లో ఘనా దేశానికి చెందిన సాంకేతిక బృందం కేంద్ర ప్రభుత్వంతో సమావేశం కానుందని ఆ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. తమ దేశానికి సింగరేణి బృందాన్ని కూడా పంపించాల్సిందిగా సీఎండీని కోరారు.

దీనిపై సీఎండీ ఎన్. బలరామ్ సానుకూలంగా స్పందిస్తూ సింగరేణి అధికారుల బృందాన్ని పంపిస్తామని పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే తొలిసారిగా ఒక ఆఫ్రికా దేశంలో అడుగుపెట్టడానికి సింగరేణి సంస్థ ముంగిటకు అవకాశం వచ్చిందని ప‌లువురు చెబుతున్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, ఘనా దేశ ప్రతినిధి బృందంలో అబ్దుల్ సలాం మోర్గాన్ అగ్బోటు, ఘనా దేశం తరఫున మాలి దేశ రాయబారి అహ్మద్ ఉమర్ సాండా , ఘనాదేశ అధ్యక్షులు జాన్ సోదరులు ప్రముఖ వ్యాపారవేత్త మైకేల్ మహామ , ఘనా దేశ స్టాండర్డ్స్ బోర్డ్ ఛైర్మన్ మొగ్తారి హుడు, ఘనా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్యాలయ సీనియర్ కరస్పాండెంట్ అగ్రే ఎలిషమా ఫ్రెడరిక్ , నేషనల్ సెక్యూరిటీ విభాగం అధికారి అంగా మ్వైన్ సైతాసలిఫు, ప్రముఖ వ్యాపారవేత్తఅగ్బెంకోర్ ఎడ్నా ఈడెం , ఘనా బిజినెస్ హెడ్ పరుల్ కక్కర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like