మాయమైన.. మట్టి మనిషి..
Andeshri:మాయమైపోతునడమ్మా… అంటూ ప్రస్తుత కాలంలో మనిషి గురించి ఎంతో చక్కగా చెప్పి.. రాష్ట్ర గీతాన్ని సైతం అందించిన ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గాయకుడు అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఎన్నో జనపదాలతో జనం గుండెల్లో నిలిచిన ఆయన ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో రాష్ట్ర గీతాన్ని సైతం మనకు అందించారు. అందెశ్రీ మృతితో సాహితీ లోకం తీరని లోటులో మునిగింది.
అందెశ్రీ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకాని తీరని లోటని అన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆ భగవంతులు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.