రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత… భక్తుల ఆగ్రహం
Vemulawada Rajanna Temple:వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం నుంచి అధికారులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కార్తీక మాసం కావడంతో రాజన్న సన్నిధికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఉదయం నుండి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రధాన గేటు వద్ద ఇనుపరేకులు అమర్చారు. అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు. ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గేటు నుంచి ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డంగా రేకులు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో భక్తులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు.
అయితే, రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పించారు. ఎల్ఈడీ తెరపై స్వామివారి దర్శనం భక్తులకు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇప్పటికే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చి స్వామి వారికి మొక్కు చెల్లిస్తామని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని భక్తులు మండిపడుతున్నారు.