మంత్రికి ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగార్జున
Minister Konda Surekha Vs Film actor Nagarjuna:మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు భారీ ఊరట లభించింది. సినీ యాక్టర్ నాగార్జున(Film actor Nagarjuna) ఆమె మీద వేసిన పరువు నష్టం దావా వాపసు తీసుకున్నాడు. మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రెండు సార్లు నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పడంతో నాగార్జున కేసు విత్ డ్రా చేసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే…?
2024 అక్టోబరు 2న మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ నాగ చైతన్య, సమంత విడాకులు కావడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. అక్కినేని నాగార్జున , కేటీఆర్ వేర్వేరుగా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కేసులు వేశారు. అలాగే ఆ అంశాలకు సంబంధించిన కథనాలు ప్రచురించిన, వ్యాఖ్యలు చేసిన పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్లు, వ్యక్తులపైనా పరువు నష్టం దావా దాఖలు చేశారు. కొండా సురేఖ రెండు సార్లు క్షమాపణలు చెప్పడంతో నాగార్జున కేసు వాపసు తీసుకున్నాడు.
ఎక్స్ వేదికగా పోస్టు..
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బహిరంగంగా పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యల్లో నాగార్జునను కానీ.. వారి కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, దానికి నేను చింతిస్తున్నాను. నాగార్జున గారిని లేదా వారి కుటుంబ సభ్యులను కించపరచాలనే లేదా అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనల వల్ల ఏదైనా అపార్థం కలిగితే దానికి నేను చింతిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను’ అని మంత్రి కొండా సురేఖ ట్వీట్లో పేర్కొన్నారు.