బెల్లంపల్లి పట్టణ స్వచ్ఛంద బంద్
Bellampalli town bandh: రోడ్డు వెడల్పు ముసుగులో వ్యాపారం జరుగుతోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్(BJP District Vice President Kodi Ramesh) ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పుకు వ్యతిరేకంగా వ్యాపార వర్గాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా పట్టణంలో స్వచ్ఛంద బంద్ కొనసాగుతోంది. ఆ బంద్కు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా కోడి రమేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో ఒక్క కిలోమీటర్ మేర మాత్రమే ట్రాఫిక్ ఉంటుందన్నారు. ఎక్కడా ఒక్క సిగ్నల్ పాయింట్ కూడా లేదని, ట్రాఫిక్ ఇబ్బంది అవుతోంది.. దాని కోసం రోడ్డు వెడల్పు చేస్తున్నామని కూడా లేదు కదా…? అని ప్రశ్నించారు. లక్షా యాభై వేల జనాభా ఉన్నప్పుడే ముప్పై ఫీట్ల రోడ్డుతోనే చక్కగా ఉండేదని అన్నారు. ఇప్పుడు యాభై వేల జనాభా ఉందని మరి వ్యాపారస్తుల పొట్టగొట్టి ఒక్క రోడ్డు వెడల్పు చేస్తే అభివృద్ధి జరుగుతుందా..? అని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Former MLA Durgam Chinnaiah) మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పట్టణాన్ని విధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వినోద్ అనైతిక ఆలోచనలతో అధికారులను పంపించి రోడ్డు విస్తరణ పనులతో వ్యాపారస్తులను రోడ్డుకు ఈడుస్తున్నారని దుయ్యబట్టారు. బంద్ అంటే రాజకీయ పార్టీలు పిలుపునిస్తాయి కానీ ఇక్కడ వ్యాపారస్తులు బందుకు పిలుపునిచ్చారని దుర్గం చిన్నయ్య అన్నారు. ఇదివరకే రోడ్డు వెడల్పుతో తొలగించిన చిరు వ్యాపారస్తులకు ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. వారి కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. వెంటనే వారికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించి వ్యాపారాలు కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు.
బెల్లంపల్లి పట్టణ బంద్కు అన్ని వర్గాల వ్యాపారస్తులు పిలుపునిచ్చారు. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.