తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 30 గంటలు..
Tirumala Rush:వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి… శిలాతోరణం వరకు కూడా సర్వ దర్శనం క్యూలైన్లు ఉన్నాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. తాత్కాలికంగా క్యూలైన్లలోకి భక్తుల అనుమతిని నిలిపివేసిన టీటీడీ… రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ లోకి అనుమతించనుంది. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. ఇక్కడి నుంచి ఆక్టోపస్ భనవం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది. రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.
ఈ వారం రోజుల పాటు ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. సెలవులు, వారాంతం కావడం, వైకుంఠ ఏకాదశి కావడంతో.. భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దర్శనం విషయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి… ఎక్కువ సేపు సమయం భక్తులకు ఇచ్చే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహనాలు బారులు తీరి కనిపించాయి. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండు వరకు కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,524 మంది భక్తులు దర్శించుకున్నారు.29,989 మంది తలనీళాలు సమర్పించగా… హుండీ కానుకలు రూ. 4.88 కోట్లు వచ్చాయి.
తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని… సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్ లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.